English | Telugu
నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్!
Updated : Nov 15, 2023
హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో అలరించిన కార్తీక నాయర్ ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి బిజినెస్ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అలనాటి టాప్ హీరోయిన్ రాధ కుమార్తెగా సినిమా రంగంలో ప్రవేశించిన కార్తీక అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. తాజాగా కార్తీక వివాహం జరగబోతుందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాధ తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖులను కలుసుకుని ఆహ్వాన పత్రికలు అందించింది. గత నెలలోనే కార్తీక నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు అనే విషయాన్ని సీక్రెట్ ఉంచారు కార్తీక కుటుంబ సభ్యులు.
ఫైనల్‌గా కార్తీక తన కాబోయే జీవిత స్వామి రోహిత్ మీనన్‌ను అందరికీ పరిచయం చేసింది. గత నెలలో జరిగిన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్‌చేస్తూ ‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్ డౌన్ ప్రారంభించా.. ’ అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన ప్రేమను వ్యక్తం చేసింది కార్తీక. రోహిత్ మీనన్ దుబాయ్‌కు చెందినవాడని తెలుస్తోంది. పెళ్లిపీటలు ఎక్కబోతున్న కార్తీకకు, రోహిత్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్ళి తేదీ కోసం ఎదురుచూస్తున్నామని కొందరు కామెంట్ చేశారు.