English | Telugu
అప్పులు తీర్చాలని ఫిక్స్ అయిన విశాల్
Updated : Apr 27, 2023
గత కొన్నాళ్లుగా వరుసగా యాక్సిడెంట్లు, అప్పుల వార్తలతో సతమతమవుతున్నారు విశాల్. వాటన్నిటి గురించి బాగా ఆలోచించి ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహితులతో అంటున్నారట.
లైకాతో తనకున్న ఇబ్బందులకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే ఓన్ బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ లో కొన్నాళ్ల పాటు సినిమాలను నిర్ణయించకూడదని అనుకుంటున్నారట. తనతో సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు కథలతో వస్తే, నచ్చితే ఓకే చేస్తానని అంటున్నారట. ప్రస్తుతం హరి సినిమాలో నటిస్తున్నారు విశాల్. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. సూర్య హీరోగా హరి ఓ సినిమా చేయాల్సింది. అయితే హరి చెప్పిన పాయింట్‌లో సూర్య కొన్ని మార్పులు చేర్పులు సూచించారట. హరి అందుకు ఒప్పుకోలేదు. గతంలో తనను నమ్మి చేసినట్టే,ఈ సబ్జెక్టును కూడా చేయమని అన్నారట. కానీ సూర్య అప్పటికే నెక్స్ట్ స్టెప్ వేసేశారు. అందువల్ల సూర్య ఇచ్చిన కోటి రూపాయల అడ్వాన్సును హరి తిరిగి ఇచ్చేయడానికి వెళ్లారట.
అయితే దాన్ని తీసుకోవడానికి సూర్య సుముఖంగా లేరు. పైగా ఇటీవల హరి స్టార్ట్ చేసిన స్టూడియో స్వయంగా వచ్చి ఓపెన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లారు. అలా సూర్య వద్దన్న సబ్జెక్టుతోనే ఇప్పుడు విశాల్ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. పూర్తి మాస్ మసాలా యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారట. హరి సినిమా మాత్రమే కాదు, నెక్స్ట్ కూడా వరుసగా బయటి బ్యానర్లలో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు విశాల్. నడిగర్ సంగం పనులను కూడా నాజర్, కార్తికే ఎక్కువగా అప్పగించేస్తున్నారట విశాల్. మల్టీస్టారర్ సినిమాలకు కూడా ఓకే చెప్పాలన్నది ఆయన లేటెస్ట్ నిర్ణయం. ఇంతకు పూర్వం షూటింగులకు అటూ ఇటూగా వచ్చే విశాల్, ఇప్పుడు టైమ్ అంటే టైమ్‌కి ఉంటున్నారనే మాట కూడా వినిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకోవడం వల్లే విశాల్‌లో ఇంత మార్పు చూడగలుగుతున్నామని అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు.