English | Telugu
హ్యాట్రిక్ రూ.100 కోట్ల సినిమాలు.. బాలయ్య తర్వాతే ఎవరైనా!
Updated : Oct 25, 2023
ఈ జనరేషన్ హీరోలతో పోటీ పడుతూ సీనియర్ హీరోలు రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది వరుసగా మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధిస్తే ఎలా ఉంటుంది?. నటసింహం నందమూరి బాలకృష్ణ అలాంటి అరుదైన ఘనతనే సొంతం చేసుకున్నారు. తెలుగు సీనియర్ స్టార్స్ లో హ్యాట్రిక్ రూ.100 కోట్ల గ్రాస్ సినిమాలు కలిగి ఉన్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం బాలయ్య అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 2021 డిసెంబర్ లో విడుదలైన 'అఖండ' చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'వీరసింహారెడ్డి' కూడా అదే బాటలో పయనించి.. రూ.130 కోట్లకు పైగా గ్రాస్ తో బాలయ్యకి మరో విజయాన్ని అందించింది. ఇక ఇటీవల విడుదలైన 'భగవంత్ కేసరి' కూడా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి.. బాలయ్యకి హ్యాట్రిక్ ని అందించింది.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరాకు విడుదలైన సినిమాల్లో అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ మూవీ.. రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంలో కేవలం ఆరు రోజుల్లోనే రూ.104 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో 'అఖండ', 'వీరసింహారెడ్డి' చిత్రాలను మించిన వసూళ్ళు రాబడుతుంది అనడంలో సందేహం లేదు.