English | Telugu
ప్రపంచంలోనే ప్రప్రథమం.. రాంగోపాల్ వర్మచే ఆవిష్కారం!
Updated : Apr 16, 2023
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా తెలుగు వారి కోసం హైదరాబాద్ లో 'తెలుగు పబ్' ప్రారంభమైంది. ఈ పబ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం. హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, సత్తా చాటుతున్న ప్రముఖ దర్శకుడు కూచిపూడి వెంకట్ ఈ 'తెలుగు పబ్'కు శ్రీకారం చుట్టారు. ఆహ్లాదకరమైన అటవీ వాతావరణాన్ని తలపించేలా వెంకట్ సారథ్యంలో గచ్చిబౌలిలో ప్రారంభమై భోజన ప్రియులను ఆకట్టుకుంటున్న 'మారేడుమిల్లి' రెస్టారెంట్ కు అనుసంధానంగా 'తెలుగు పబ్'ను ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'డీజే అప్పారావ్' అనే సంగీత ప్రియుడి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు వెంకట్. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఈ అచ్చ "తెలుగు పబ్" పసందైన వినోదం అందించనుంది.
మారెడుమిల్లి రెస్టారెంట్ ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రారంభించడం తెలిసిందే. తాజా ఈ వన్ అండ్ ఓన్లీ 'తెలుగు పబ్'ను రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించి.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి.. కూచిపూడి వెంకట్ ప్రవేశ పెట్టిన "బీర్టెయిల్" - డీజే అప్పారావ్" అనే కాన్సెప్తులు తనకు విపరీతంగా నచ్చాయని, ఇవి కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయని ఆర్జీవి పేర్కొన్నారు.
"మొదటి సినిమా, జాన్ అప్పారావు 40 ప్లస్" చిత్రాలతో దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకున్న కూచిపూడి వెంకట్... గత కొన్నేళ్లుగా 'హోటల్ ఇండస్ట్రీ'లో రాణిస్తున్నారు. పబ్ లో పాశ్చాత్య సంగీతం మాత్రమే ఎందుకు ప్లే చేయాలి? అచ్చమైన మన తెలుగు పాటలు ఎందుకు వినిపించకూడదు? మన పాటలు, ఏ పాటల కంటే తక్కువ? అనే మథనం నుంచి 'తెలుగు పబ్' పురుడు పోసుకుందని వెంకట్ తెలిపారు. అలాగే బీరును పలు రకాల తెలుగు ఫ్లేవర్స్ లో అందించడం కోసం "బీర్టెయిల్"కు జీవం పోశామని, "మారేడుమిల్లి" ప్రియులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేరే ఫ్లోర్ లో ఇది ఏర్పాటు చేశామని చెప్పారు.
"తమ కాలక్షేపం కోసం ఎదుటివారి సమయాన్ని విచ్చలవిడిగా వేస్ట్ చేసేవారికి చెంపపెట్టులాంటి వినూత్నమైన కాన్సెప్ట్"తో తన మూడో చిత్రం కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఈ సందర్భంగా వెంకట్ ప్రకటించారు. త్వరలోనే "కూచిపూడి పలావ్" ఫ్రాంచైజ్ లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుమన్ వర్మ, రచయిత బి.వి.ఎస్.రవి తదితరులు పాల్గొని కూచిపూడి వెంకట్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.