English | Telugu
నువ్వు 'ఇస్మార్ట్' అయితే, నేను 'ఇస్మార్ట్ కా బాప్'.. రామ్ కి పోటీగా కొత్త హీరో!
Updated : Aug 31, 2023
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదేరోజు 'ఇస్మార్ట్ కా బాప్' అంటూ ఓ కొత్త హీరో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం విశేషం.
ఆదిత్య గంగసాని అనే అతన్ని హీరోగా పరిచయం చేస్తూ తాజాగా అభిషేక్ పిక్చర్స్ 'గన్ను భాయ్' అనే చిత్రాన్ని ప్రకటించింది. ప్రణయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'ఇస్మార్ట్ కా బాప్' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా తాజాగా మేకర్స్ విడుదల చేశారు. హీరో డప్పుకొడుతూ ఉన్న కలర్ ఫుల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని 2024, మార్చి 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 'ఇస్మార్ట్ కా బాప్' అనే ట్యాగ్ లైన్ పెట్టడంతో పాటు.. 'డబుల్ ఇస్మార్ట్' విడుదలవుతున్న రోజే విడుదల చేయనున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అసలు ఈ కొత్త హీరో ఆదిత్య గంగసాని ఎవరు? అని కొందరు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇతనొక యూట్యూబర్. గతంలో ఇతను చేసిన పలు పాటలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు హీరోగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.