English | Telugu
విజయ్ లియో.. మిస్కిన్‌కి థాంక్స్ చెప్పిన లోకేష్!
Updated : Mar 3, 2023
సౌత్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లియో. విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మిస్కిన్ కీ రోల్‌లో నటించారు. ఆయన నటించిన సన్నివేశాలను ఇటీవల షూట్ చేశారు. దీని గురించి మిస్కిన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టును విజయ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ``ఇవాళ కశ్మీర్ నుంచి చెన్నైకి బయలుదేరాను. మైనస్ 12 డిగ్రీల చలిలో 500 మందితో లియో టీమ్ పనిచేస్తోంది. స్టంట్ మాస్టర్లు అన్బు, అరివు భారీ ఫైట్ తెరకెక్కించారు. అసిస్టెంట్ డైరక్టర్ల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిర్మాత లలిత్ అంత చలిలోనూ చిన్న కార్మికుడిలాగా సెట్లో పనిచేస్తున్నారు.
లోకేష్ కనగరాజ్‌లో మెచ్యూరిటీ కనిపిస్తోంది. ఎక్కడ కఠినంగా వ్యవహరించాలో, ఎక్కడ బ్రెయిన్ వాడాలో తెలిసిన డైరక్టర్ లోకేష్. నా లాస్ట్ సీన్ పూర్తికాగానే నన్ను కౌగలించుకున్నాడు. నేను అతని నుదిటి మీద ముద్దుపెట్టాను. నా ప్రియతమ తమ్ముడు విజయ్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. నా పట్ల అతను చూపించిన ప్రేమ, ఆదరణను నేను ఎప్పటికీ మర్చిపోను. లియో ఎవరూ ఊహించనంత పెద్ద విజయం సాధిస్తుంది`` అని రాశారు. మిస్కిన్ పోస్టుకి లోకేష్ కనగరాజ్ కూడా అంతే హృద్యంగా స్పందించారు. ``నేను మీకెప్పుడూ థాంక్స్ సరిగా చెప్పలేదు. మీకు మిలియన్ థాంక్స్. అది కూడా నా కృతజ్ఞతను మీకు సంపూర్ణంగా చేరవేయలేదు.
సెట్స్ లో మీరుంటే చాలా ఆనందంగా అనిపించింది. మీతో పనిచేయడం నా అదృష్టం`` అని అన్నారు. వారసుడు తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లియో. కమల్‌హాసన్‌తో విక్రమ్ విజయవంతమయ్యాక లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. అక్టోబర్ 19న చిత్రాన్ని విడుదల చేయాలన్నది యూనిట్ ప్లాన్.