English | Telugu
‘మెగా’ సినిమాలో మరో బ్యానర్..డీల్ అదేనా!
Updated : Jul 25, 2023
మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై సినీ సర్కిల్స్‌లో ఇప్పటికే చాలా రకాలైన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ.. తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేయటానికి చిరంజీవి సర్వం సిద్ధం చేసుకున్నారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. చిరంజీవి పెద్దమ్మాయి సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. సినిమాను లాంఛనంగా ప్రారంభించటమే కాకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెట్స్‌పైకి తీసుకెళ్లాలనేది మేకర్స్ ఆలోచన.
ఈ సినిమా నిర్మాణాన్ని సుష్మిత మాత్రమే చేయాలనుకున్నారు. కానీ టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సైతం ఇప్పుడు ప్రొడక్షన్‌లో భాగం అవటానికి రెడీ అయ్యింది. ఆ నిర్మాణ సంస్థ ఏదో కాదు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని అంటున్నారు మరి. ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే అనౌన్స్‌మెంట్ వరకు ఆగాల్సిందే. సినిమా నిర్మాణానికి వ్యయమంత తామే పెడతామని, లాభాల్లో 50-50 వాటాను తీసుకుందామని డీల్ పెట్టారట. రిస్క్ లేని డీల్ కావటంతో చిరంజీవి సైతం ఈ డీల్‌కు ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితో పాటు మరో జంట కూడా అలరించనుందని అంటున్నాయి మీడియా వర్గాలు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి తీసుకు రావాలనేది ప్రస్తుత ఆలోచనగా కనిపిస్తుంది. ఆగస్ట్ 11న భోళా శంకర్‌గా మెప్పించటానికి చిరంజీవి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. తమిళ చిత్రం `వేదాళం`కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది.