English | Telugu
'బ్రో' థీమ్ సాంగ్.. ఇది కదా థమన్ అంటే!
Updated : Jul 25, 2023
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా.. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే 'మై డియర్ మార్కండేయ', 'జాణవులే' పాటలు విడుదల కాగా, తాజాగా బ్రో థీమ్ సాంగ్ విడుదలైంది.
"బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం" అనే శ్లోకంతో బ్రో చిత్రం నుంచి పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ పాత్రలను చిత్రం బృందం పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ శ్లోకంతోనే బ్రో థీమ్ సాంగ్ సాగింది. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం ఎంత పవర్ ఫుల్ గా ఉందో, థమన్ సంగీతం కూడా అదే స్థాయిలో ఉంది. పవన్ స్క్రీన్ ప్రజెన్స్ కి థమన్ మ్యూజిక్ తోడై బిగ్ స్క్రీన్ మీద గూస్ బంప్స్ తెంపించేలా ఉంది ఈ సాంగ్. 'మార్కండేయ', 'జాణవులే' పాటలతో పోలిస్తే ఈ థీమ్ సాంగ్ ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకునేలా ఉంది.
'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత పవన్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు(జూలై 25) సాయంత్రం జరగనుంది.