English | Telugu
మెగాస్టార్ కెరీర్ లో 10 మైల్ స్టోన్స్ ఇవే
Updated : Aug 22, 2023
ప్రాణం ఖరీదు చిత్రంతో నటుడిగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సహాయ నటుడిగా, విలన్ గా నటించారు. న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,చట్టానికి కళ్ళులేవు, అభిలాష వంటి సినిమాలతో పూర్తి స్థాయి హీరోగా నిలబడినా అప్పటిరకు కమర్షియల్ హీరోగా బ్రేక్ రాలేదనే చెప్పాలి. తన కెరీర్ లో 45 సినిమాల తర్వాత ఖైదీ చిత్రంతో తిరుగులేనికమర్షియల్ హీరో అనిపించుకున్నారు చిరంజీవి. ఆ సినిమాతో ప్రారంభమైన చిరు ప్రభంజనం తెలుగు సినిమా కమర్షియల్ రేంజ్ ని పెంచే స్థాయికి ఎదిగింది. అలా మెగాస్టార్ కెరీర్ లో గొప్పగా చెప్పుకునేసినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ప్రస్తావించాల్సి వస్తే...
ఖైదీ
ఈ సినిమా ముందు వరకు ఒక సాధారణ హీరోగా అందరి మన్ననలు అందుకుంటూ వచ్చిన చిరంజీవికి ఖైదీ చిత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఒక్క సినిమాతోనే అతను కమర్షియల్ హీరోఅయిపోయారు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సిల్వస్టర్ స్టాలిన్ నటించిన హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ ని పోలి ఉన్నప్పటికీ మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఖైదీ చిత్రంరూపొంది అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంది. ఈ సినిమాలో చిరు నటన, యాక్షన్ సీక్వెన్స్ లలో కనబరిచిన వేగం ఆడియన్స్ ని కట్టిపడేసింది. రగులుతోంది మొగలిపొద.. అనే పాటకుహీరోయిన్ మాధవితో కలిసి చిరంజీవి వేసిన స్టెప్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ సినిమా ఆడియోపరంగా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. హీరోగా ఈ సినిమా చిరంజీవి రేంజ్ నిఎక్కడికో తీసుకెళ్లింది. ఖైదీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం చిరంజీవికి రాలేదు. ఈ సినిమా తర్వాత చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.
పసివాడి ప్రాణం
ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే రూపొందిన మరో బ్లాక్ బస్టర్ మూవీ పసివాడి ప్రాణం. హాలీవుడ్ లో హరిసన్ ఫోర్డ్ హీరోగా నటించిన విట్ నెస్ చిత్రాన్ని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఈ చిత్రాన్నిరూపొందించారు. తన తల్లిదండ్రులను హత్య చేయడాన్ని కళ్ళారా చూసిన రాజా అనే కుర్రాడి చుట్టూ తిరిగే కథ ఇది. చెవిటి, మూగ వాడైన రాజా తన తల్లిదండ్రులను హత్య చేసిన వివరాలను చెప్పడంలోవిఫలమవుతాడు. ఆ సమయంలో పరిచయమైన మధు(చిరంజీవి) ఆ నరహంతకులను ఎలా కనిపెట్టాడన్నది కథాంశం. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి స్టైట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. చిరు డాన్స్ ఆడియన్స్ తో స్టెప్స్ వేయించింది. ఈ చిత్రంలోని పాటలు విజయవంతం అయ్యాయి. హీరోగా చిరంజీవి రేంజ్ ని ఈ సినిమా మరింత పెంచింది. అంతేకాదు, చిరంజీవిని అభిమానించే వారి సంఖ్య కూడా ఈ సినిమా పెంచింది.
స్వయంకృషి
చిరంజీవి కెరీర్ లో మరో వైవిధ్యమైన సినిమా స్వయంకృషి. చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి పెద్ద వ్యాపార వేత్తగా ఎదిగిన సాంబయ్య(చిరంజీవి) జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, అతని జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని అతను ఎలా అధిగమించాడు అనేది ఈ సినిమా కథాంశం. ఈ క్రమంలో తన ఆస్తిని త్యాగం చేసి మళ్ళీ చెప్పులు కుట్టుకుంటూ తన జీవనాన్ని సాగిస్తాడు. ఎంతో వైవిధ్యమున్న ఈ కథను మరెంతో వైవిధ్యంగా తీర్చి దిద్దారు దర్శకుడు కె.విశ్వనాథ్. రమేష్ నాయుడు స్వర పరచిన ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. నటుడిగా చిరంజీవిని ఒక స్థాయిలో నిలబెట్టిన సినిమా ఇది.
జగదేకవీరుడు అతిలోక సుందరి
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫాంటసీ మూవీ ఇది. దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య ఇంద్రజ(శ్రీదేవి) అనుకోని పరిస్థితుల్లో గైడ్ అయిన రాజు(చిరంజీవి)కి తారసపడుతుంది. ఇంద్రజ దేవలోకానికి తిరిగి వెళ్ళడానికి అవసరమైన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. అది రాజు దగ్గర ఉందని తెలుసుకొని దానికోసం అతనికి దగ్గరవుతుంది. ఆ తర్వాత కథనం ఆడియన్స్ ని ఎంతో ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సినిమా పెద్దలతోపాటు పిల్లల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది. అప్పట్లో ఇది ఇండస్టీ హిట్ అవ్వడంతో మెగాస్టార్
రేంజ్ మరింత పెరిగింది. ఇళయరాజా స్వర పరిచిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అబ్బనీ తియ్యనీ దెబ్బ.. అనే పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి వేసిన స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
గ్యాంగ్ లీడర్
విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. చిరంజీవి డాన్స్, ఫైట్స్ ప్రేక్షకులతో, అభిమానులతో విజిల్స్ వేయించాయి. బప్పిలహరి సంగీతం అందించిన
ఈ సినిమా ఆడియోపరంగా పెద్ద విజయాన్ని అందుకుంది. అప్పటివరకు చూడని చిరంజీవి కొత్త స్టైల్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా చిరంజీవిని తిరుగులేని మెగాస్టార్ గా నిలబెట్టింది. ఘరానా మొగుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన మరో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు. కలెక్షన్ల పరంగా అప్పటివరకు ఉన్న రికార్డుల్ని ఈ సినిమా తిరగరాసింది. యం.యం.కీరవాణి అందించిన ఈ సినిమా సంగీతం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో బంగారు కోడిపెట్ట పాటకు చిరంజీవి వేసిన స్టెప్స్ ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాయి.
చూడాలని ఉంది
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన విభిన్న కథా చిత్రమిది. అప్పటి వరకు చిరంజీవి చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా సాగే కథనంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించిన సినిమా ఇది.మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. యమహా నగరి కలకత్తా పురి, రామ్మా చిలకమ్మా పాటలు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి.ఈ సినిమా మెగాస్టార్ కి కొత్త ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.
ఇంద్ర
బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన డిఫరెంట్ మూవీ ఇది. అప్పటివరకు ఈ జోనర్ లో సినిమా చెయ్యని చిరంజీవికి ఇంద్ర ఒక డిఫరెంట్ మూవీగా నిలిచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది ఈ సినిమా. ఇందులో చిరంజీవి చెప్పిన డైలాగులు అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి. ఈ సినిమాతో చిరంజీవి ఇమేజ్ తారాస్థాయికి చేరింది.
ఠాగూర్
చిరంజీవి కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన సినిమా ఇది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని సోషల్ మెసేజ్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. ఈ సినిమాలోని చిరంజీవి మెచ్యూర్డ్
పెర్ ఫార్మెన్స్ అతనిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
ఖైదీ నంబర్ 150
కొంత గ్యాప్ తర్వాత చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన మొదటి సినిమా ఇది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చిరంజీవిలోని ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసింది.60 సంవత్సరాలు పైబడినప్పటికీ డాన్స్ లోనూ, ఫైట్స్ లోనూ మునుపటి వేగాన్ని ప్రదర్శించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మెగాస్టార్. కలెక్షన్ల పరంగానూ చిరంజీవి స్టామినా ఏమీ తగ్గలేదనినిరూపించిన సినిమా ఖైదీ నంబర్ 150.