English | Telugu
ఇక సెలవు.. ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు
Updated : Nov 13, 2023
శనివారం మృతి చెందిన నటుడు చంద్రమోహన్ అంత్య క్రియలు సోమవారం జరిగాయి. అమెరికాలో స్థిరపడిన ఆయన కుమార్తె ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకోవడంతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. 55 ఏళ్ళపాటు ప్రేక్షకులను తన నటనతో అలరించిన చంద్రమోహన్ తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. ఫిలింనగర్‌లో మొదలైన అంతిమ యాత్ర పంజాగుట్ట శ్మశానం వరకు సాగింది. చంద్రమోహన్ అంతిమ సంస్కారాలను ఆయన తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించారు. చంద్రమోహన్ భౌతికకాయానికి కుటుంబసభ్యులతోపాటు వెంకటేష్, రాజశేఖర్, జీవిత, జి.ఆదిశేషగిరిరావు, మాదాల రవి అశ్రునయనాలతో నివాళులర్పించారు. చంద్రమోహన్ పార్థీవ దేహాన్ని హైదబాద్‌లోని ఫిలిం ఛాంబర్ వద్ద కొద్దిసేపు ఉంచుతారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని కుటుంభ సభ్యులు తెలిపారు. చంద్రమోహన్ చనిపోయిన రోజే ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన నివాసం వద్దకే వచ్చి కడసారి దర్శించుకొని నివాళి అర్పించారు.
చంద్రమోహన్‌కు 2006లో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి సినిమాలు చాలావరకు తగ్గించుకున్నారు. 2017 వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించిన ఆయన ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. హృద్రోగంతోపాటు కిడ్నీ సమస్య కూడా తలెత్తడం వల్ల ఆయన కోలుకోలేకపోయారు. శనివారం ఉదయం స్పృహ తప్పి పడిపోయిన చంద్రమోహన్‌ను కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు.