English | Telugu
చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు
Updated : Sep 30, 2023
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జైలు పాలు చేయడం చాలా అన్యాయమని నటుడు, దర్శకుడు రవిబాబు వ్యాఖ్యానించారు. చాలా ఆలస్యంగా ఈ విషయంపై స్పందించిన రవిబాబు ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారో తనకు అర్థంకావడం లేదన్నారు. అధికారమనేది శాశ్వతం కాదని, అలాంటి అశాశ్వతమైన అధికారంతో చంద్రబాబును జైల్లో పెట్టినవారు అదే అధికారాన్ని ఉపయోగించి చిటికెలో ఆయన్ని బయటికి తీసుకురావచ్చని అన్నారు. రవిబాబు విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ విషయంపై రవిబాబు స్పందిస్తూ ‘సినిమా వాళ్ల గ్లామర్ కానీ, రాజకీయ నాయకుల పవర్‌గానీ, చంద్రబాబు నాయుడుగారికి వచ్చిన కష్టాలు గానీ, ఏదీ శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడుగారు ఏ పని చేసినా 100 కోణాల్లో ఆలోచించి, అందరినీ సంప్రదించి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషి కాదు. మరి అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావడం లేదు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం చాలా దారుణం. అశాశ్వతమైన అధికారం ఉన్నవాళ్లకు నా వినయపూర్వక అభ్యర్థ ఏంటంటే.. మీరు ఏ పవర్‌ను అయితే వాడి ఆయన్ని జైల్లో పెట్టారో దయచేసి అదే పవర్‌ను ఉపయోగించి ఆయన్ని వదిలేయండి’ అన్నారు.
ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు టీడీపీ మద్దతుదారులతో పాటు చంద్రబాబు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వైసీపీ మద్దతుదారులు మాత్రం రవిబాబు వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే ఆయనకు జ్యుడిషియల్ కోర్టు రిమాండ్ ఎందుకు విధించిందని ఎదురు ప్రశ్నిస్తున్నారు.