English | Telugu
కెప్టెన్ మిల్లర్ మీద ఫోకస్ పెంచిన ధనుష్
Updated : Nov 3, 2023
2023 తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందా, లేదా అని తర్జనభర్జన పడుతున్నారు హీరో ధనుష్. ఎందుకంటే ఆల్రెడీ ఈ సంవత్సరం ఆయనకు ఇచ్చిన గిఫ్ట్ అలాంటిది మరి! తెలుగులో చేసిన సార్ మూవీ ఈ ఏడాది సూపర్‌డూపర్ హిట్ అయింది. అదే సినిమా తమిళ్‌లో కూడా ఇరగాడేసింది. తెలుగులో సార్‌గా, తమిళ్‌లో వాత్తిగా మెప్పించేశారు ధనుష్. రెండు సినిమాల్లోనూ గడ్డంతో తన స్టామినా చూపించారు. మరోసారి అదే గడ్డంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అడ్వంచరస్ ఫిల్మ్‌గానూ ప్రొజెక్ట్ చేస్తున్నారు మేకర్స్. అరుణ్ మాదేశ్వరన్ డైరక్ట్ చేస్తున్నారు. ధనుష్‌కి బాగా కలిసొచ్చిన సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది.
టైటిల్ రోల్‌లో ధనుష్ నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. సందీప్ కిషన్ కీ రోల్ చేస్తున్నారు. గతేడాది జులైలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. చెన్నై, తిరునెల్వేలి, తెన్‌కాశిలో కీ పోర్షన్ షూట్ చేశారు. డిసెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ధనుష్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు యమా వేగంగా జరుగతున్నాయి. కిల్లర్ కిల్లర్ అంటూ తాను డబ్బింగ్ చెబుతున్న సంగతిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రియాంక మోహన్. డిసెంబర్ 15న తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో ఈ సినిమా విడుదల కానుంది. బిజినెస్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా హిట్ కోసం ధనుష్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2023లో ఆల్రెడీ అందుకున్న సక్సెస్‌ని కెప్టెన్ మిల్లర్ కంటిన్యూ చేస్తుందన్న ధీమా కనిపిస్తోంది ధనుష్‌లో.