English | Telugu
తారక్, బన్నీ సినిమాలకు రైటర్ గా పనిచేసిన 'బలగం' డైరెక్టర్!
Updated : Mar 10, 2023
'బలగం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కమెడియన్ వేణు(వేణు యెల్దండి) మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. వెండితెరపై, బుల్లితెరపై కమెడియన్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న వేణులో ఇంతమంచి రచయిత, దర్శకుడు దాగి ఉన్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే నిజానికి వేణు దర్శకుడు కావాలనే లక్ష్యంతోనే సినీ పరిశ్రమకు వచ్చాడు. ఈ క్రమంలో అతను కొన్ని చిత్రాలకు రచయితగా పనిచేశాడు. అందులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్లు నటించిన సినిమాలు ఉండటం విశేషం.
అనుష్క టైటిల్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి అనే కీలక పాత్రలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. గన్నారెడ్డి పాత్రలో తెలంగాణ మాండలికంలో బన్నీ చెప్పిన డైలాగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఆ గన్నారెడ్డి ఎపిసోడ్ కి సంబంధించిన సంభాషణలు వేణునే రాశాడట.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' సినిమాలో కూడా వేణు కీలక సన్నివేశం రాశాడు. రౌడీ గ్యాంగ్ నుంచి లోన్ రికవర్ చేయడానికి లవ ప్లేస్ లో బ్యాంక్ మేనేజర్ గా కుశ వెళ్లి వాళ్ళని కొడతాడు. అయితే చేపల చెరువు కోసం లోన్ తీసుకొని ఎగ్గొట్టడంతో.. ఆ గ్యాంగ్ లో ఒక్కో రౌడీని ఒక్కో చేపతో పోల్చుతూ కుశ వారిని కొట్టే సన్నివేశానికి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ కూడా వేణునే రాశాడు.