English | Telugu

బాహుబ‌లి కోసం నాగ్ చేసిన త్యాగం

టాలీవుడ్ మొత్తానికి బాహుబ‌లి ఫీవ‌ర్ పాకేసింది. అంద‌రూ ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌భాస్ అభిమానులే కాదు, తెలుగు ప్రేక్ష‌కులు... సినీ సెల‌బ్రెటీస్ అంతా బాహుబ‌లి మాయ‌లో ఉన్నారిప్పుడు. ఈ జాబితాలో నాగార్జున కూడా ఉన్నారు. ''తెలుగు సినిమాని మ‌రో మెట్టు పైకి తీసుకెళ్లి, అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టే గొప్ప చిత్రం బాహుబ‌లి. ఈ సినిమా కోసం అంద‌రితో పాటు నేనూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. రాజ‌మౌళి అండ్ టీమ్ డెడికేష‌న్ న‌న్ను క‌ట్టి ప‌డేసింది. రాజ‌మౌళి ఎప్పుడు క‌లిసినా బాహుబ‌లి గురించి అడిగి తెలుసుకొంటున్నా..'' అంటున్నారు నాగ్‌. అంతేకాదు...'బాహుబ‌లి' కోసం నాగ్ ఓ త్యాగం కూడా చేశార‌ట‌. ''ర‌మ్య‌కృష్ణ‌తో ప్ర‌స్తుతం నేనో సినిమా చేస్తున్నా. త‌ను బాహుబ‌లిలో కూడా యాక్ట్ చేస్తోంది. ఓసారి మా సినిమా సెట్లో ఉన్న‌ప్పుడు రాజ‌మౌళి గారి నుంచి ఫోన్ వ‌చ్చింది. 'ర‌మ్య‌కృష్ణ‌తో రెండు మూడుసీన్లున్నాయి. త‌ను లేక‌పోతే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఆమెను పంపగ‌ల‌రా.. ' అని రాజ‌మౌళి అడిగారు. వెంట‌నే నా సినిమా షూటింగ్‌ని క్యాన్సిల్ చేసి `బాహుబ‌లి` సెట్‌కి పంపాను.. ఎందుకంటే ఆ సినిమా అంటే అంతిష్టం'' అని చెప్పుకొచ్చారు నాగార్జున‌.