English | Telugu
బ్యాడ్ టైం.. రామ్ చరణ్ లాంటి స్టార్ ఖాళీగా ఉండటమేంటి!
Updated : Oct 5, 2023
'ఆర్ఆర్ఆర్' లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ మరే కొత్త సినిమాని స్టార్ట్ చేయకుండా పూర్తి దృష్టిని 'ఆర్ఆర్ఆర్'పైనే పెట్టాడు. కానీ చరణ్ మాత్రం ఆ సమయంలో తన తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' పూర్తి చేశాడు. అలాగే శంకర్ డైరెక్షన్ లో 'గేమ్ ఛేంజర్' సినిమాని ప్రారంభించాడు. 'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత కూడా అదే తీరు. అది విడుదలైన ఏడాది దాకా ఎన్టీఆర్ తన కొత్త సినిమా దేవరను మొదలుపెట్టలేదు. చరణ్ మాత్రం ఆచార్యను విడుదల చేశాడు. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ లో పాల్గొన్నాడు. దాదాపు సగం షూటింగ్ కూడా పూర్తి చేశాడు. దీంతో 'ఆర్ఆర్ఆర్' స్టార్స్ లో చరణ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంటే, ఎన్టీఆర్ మాత్రం విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడని కామెంట్స్ వినిపించాయి. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ తీరు పట్ల ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.
ఎన్టీఆర్ 'దేవర'ను ఆలస్యంగా స్టార్ట్ చేసినా పక్కా ప్లానింగ్ తో చకచకా పూర్తి చేస్తున్నాడు. ఈ ఏడాది చివరి కల్లా దేవర షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీ కానున్నాడు. 'వార్-2' షూటింగ్ ని కూడా మూడు నెలల్లో పూర్తి చేసి, ఆ వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పైకి షిఫ్ట్ కానున్నాడు. ఇది 2024 ఏప్రిల్ లో మొదలుకానుంది. ఇది పూర్తి కాగానే 'దేవర-2' లైన్ లో ఉంది. ఇలా ఎన్టీఆర్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తుంటే.. చరణ్ మాత్రం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు.
అప్పట్లో కొన్ని కారణాల వల్ల 'ఇండియన్-2' షూటింగ్ వాయిదా పడటంతో ఆ గ్యాప్ లో చరణ్ తో 'గేమ్ ఛేంజర్'ను స్టార్ట్ చేశాడు దర్శకుడు శంకర్. 'గేమ్ ఛేంజర్' కొంత షూటింగ్ జరిగాక, 'ఇండియన్-2' వివాదం సద్దుమణగడంతో ఆ సినిమాపైకి శంకర్ ఫోకస్ షిఫ్ట్ అయింది. ప్రస్తుతం శంకర్ దృష్టి ఎక్కువగా ఇండియన్-2' మీదే ఉంది. దాంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యమవుతోంది. ఇంకా 40 శాతానికి పైగా షూటింగ్ పెండింగ్ ఉంది అంటున్నారు. 'ఇండియన్-2' పూర్తై విడుదలైతే తప్ప, శంకర్ 'గేమ్ ఛేంజర్'పై ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశంలేదు. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో అని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా ప్రకటించగా ఏవో కారణాల వల్ల అది ఆగిపోయింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించాడు కానీ, అది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడో మొదలుపెట్టిన 'గేమ్ ఛేంజర్' ఆలస్యమవుతోంది. బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు. దీంతో చరణ్ లాంటి స్టార్ ఖాళీగా ఉంటూ అనవసరంగా తన ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకుంటున్నాడని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.