English | Telugu
బాబాయ్ కోసం అబ్బాయ్ మ్యూజిక్ డైరెక్టర్!
Updated : Jun 13, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బాలకృష్ణ సినిమాలకు వరుసగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో పాటు ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 'భగవంత్ కేసరి'కి కూడా థమనే సంగీతం అందిస్తున్నాడు. 'NBK109'కి సైతం ముందుగా థమన్ పేరే వినిపించింది. అయితే ఇప్పుడు అనిరుధ్ పేరు తెరపైకి వచ్చింది. సితార బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న 'VD 12'కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు 'NBK109'కి సైతం అనిరుధ్ నే రంగంలోకి దింపాలని సితార నిర్ణయించినట్లు సమాచారం.
తమిళ్ లో వరుస సినిమాలతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న అనిరుధ్.. తెలుగు సినిమాలపైనా దృష్టి పెడుతున్నాడు. గతంలో 'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' వంటి సినిమాలకు సంగీతం అందించాడు. ప్రస్తుతం 'VD 12'తో పాటు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'దేవర'కు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మాస్ సాంగ్స్, అదిరిపోయే బీజీఎం లు కొట్టడంలో అనిరుధ్ దిట్ట. మరి మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ తారక్ కి అనిరుధ్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడోనన్న ఆసక్తి నెలకొంది.