English | Telugu
‘ఆదిపురుష్’ త్రీడీ ఐమ్యాక్స్ వెర్షన్ లేనట్టేగా!
Updated : Jun 13, 2023
రఘునందనుడు రాఘవుడిగా ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్. జానకీమాతగా కృతిసనన్ నటించారు. ఓమ్ రవుత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్‌కి ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది ఆదిపురుష్. మేం 10 వేల టిక్కెట్లు కొంటామంటే, 10 వేల మందికి మేం చూపిస్తామని పోటీపడుతున్నారు ఆదిపురుష్ విషయంలో సెలబ్రిటీలు. ఖమ్మం జిల్లాలోని రామాలయాలకు 101 టిక్కెట్లు పంపిణీ చేస్తామంటూ ముందుకొచ్చింది ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ. రామనామాన్ని సర్వత్రా వినిపించేలా చేయడం సుకృతం. రామనామార్చనలో పాలుపంచుకునే అదృష్టం మాకు దక్కిందని అంటున్నారు మంచు మనోజ్. 2500 మంది అనాథ పిల్లలకు సినిమా చూపిస్తామన్నది ఆయన వెర్షన్. ఇవన్నీ ఒక వైపు. ఆదిపురుష్ త్రీడీ ఐమ్యాక్స్ వెర్షన్ రాదన్నది ఇంకో వైపు. ఐమ్యాక్స్ త్రీడీ వెర్షన్‌లో డార్లింగ్ ప్రభాస్‌కి సాహో చెప్పాలని వెయిట్ చేశారు ఫ్యాన్స్. అయితే అది జరగడం లేదన్నది లేటెస్ట్ న్యూస్. ఇండియాలో అది సాధ్యం కాదన్నది వైరల్ అవుతున్న వార్త.
సూపర్ హీరో సినిమా ది ఫ్లాష్ అదే రోజు విడుదలవుతోంది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్ ఐమ్యాక్స్ త్రీడీ వెర్షన్‌ని బ్లాక్ చేసింది. అందుకే ఆదిపురుష్‌కి థియేటర్లు అందుబాటులో లేవన్నది ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్న విషయం. ఇలాంటి విషయాల్లో ముందుండాలి కదా అని మేకర్స్ కి సలహాలు అందుతున్నాయి ఫ్యాన్స్ నుంచి. అయితే, ఇవన్నీ సినిమాకు ముందు వినిపించే రూమర్లేనని, ఐమ్యాక్స్ త్రీడీ వెర్షన్ ఉంటుందనీ భరోసా ఇస్తున్నారు మరికొందరు. కేజీఆర్ ఫిల్మ్స్ తరఫున ఈ సినిమాకు పనిచేస్తున్న కార్తిక్ గౌడ స్పందించారు. ఆదిపురుష్ 2డీ, త్రీడీ, ఐమ్యాక్స్ లో ఉంటుందని అన్నారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.