English | Telugu

మహేష్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేయనున్నారు మహేష్. అయితే 'గుంటూరు కారం'కి, రాజమౌళి సినిమాకి మధ్యలో.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అనిల్ క్లారిటీ ఇచ్చారు.

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో గతంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా వచ్చింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. పైగా రావిపూడికి వేగంగా సినిమాలు పూర్తి చేస్తాడనే పేరుంది. అందుకే రాజమౌళితో సినిమాకి ముందు అనిల్ తో ఓ సినిమా ఉంటుందంటే మహేష్ ఫ్యాన్స్ కూడా సంబర పడ్డారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే అది రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈలోపు మరో సినిమా వస్తే ఫ్యాన్స్ కి హ్యాపీనే. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో సినిమాపై స్పందించిన అనిల్ రావిపూడి.. "సినిమాలకు అతీతంగా మహేష్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మహేష్ తో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ రెడీనే. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళి గారి సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ నిజంగా గ్యాప్ ఉందని మహేష్ గారు అడిగితే తప్పకుండా చేస్తాను. భవిష్యత్ లో కూడా మహేష్ గారితో సినిమా చేసే అవకాశమొస్తే ఎప్పుడూ వదులుకోను" అన్నారు.