English | Telugu
మాస్ మహారాజ రవితేజ అసలు రహస్యాన్ని చెప్పిన స్నేహితుడు!
Updated : Feb 8, 2023
మాస్ మహారాజా రవితేజ తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నటుడిగా మారడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక హీరోగా ఛాన్స్ రావడానికి ఆయన చేసిన ప్రయత్నం, పడిన కష్టం ఆయన స్నేహితులకు మొదటి నుంచి ఆయన కెరీర్ను గమనించిన వారికి బాగా అర్థమవుతుంది. అలాంటి రవితేజ రెండు మూడు ఫ్లాప్ వస్తే డీలపడడు. పోరాటమే ఆయన నైజం. పోరాడి పోరాడి చివరకు విజయం సాధిస్తాడు. ఈమధ్య ఆయన కెరీర్ చాలా ఒడిదుడుకులకు లోనయింది. డ్రగ్స్ కేసుతో పాటు వరుస అపజయాలు ఎదురయ్యాయి.
వరస ఫ్లాప్ చిత్రాలు ఆయన్ని పలకరించాయి. సిక్స్ ప్యాక్ మోజులో ఆయన ఫేసులో గ్లో పోయింది. దాంతో ఇక రవితేజ పని అయిపోయిందని అందరూ మాట్లాడారు. కానీ మరలా ఆయన రాజా ది గ్రేట్ తో హిట్టు కొట్టారు. మరల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. ఈసారి క్రాక్ తో సమాధానం చెప్పారు. మరల వెంటనే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో డిజాస్టర్లు అందుకున్నారు. ఆయన నటించిన ధమాకా చిత్రం మొదటి షో డివైడ్ టాక్ను మూటగట్టుకుంది. రివ్యూలు కూడా సరిగా రాలేదు. రేటింగ్స్ అసలు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ అనూహ్యంగా రవితేజ పుంజుకున్నారు.
ఓ రొటీన్ మాస్ మసాలా చిత్రాన్ని తన స్టామినాతో100 కోట్ల క్లబ్ లో చేర్చి తానేమిటో నిరూపించుకున్నారు. అసలు ధమాకా ఈ స్థాయి విజయం సాధిస్తుందని, రవితేజ కెరీర్ లోనే తొట్టతొలి సారిగా 100 కోట్ల క్లబ్బులో చేరుస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక ఆ తర్వాత వాల్తేరు వీరయ్య చేశారు. ఇందులో మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి కావడంతో రవితేజకు అంత సీన్ ఉండదని అందరూ భావించారు. కానీ తనకు ఛాలెంజింగ్ తరహా పాత్ర రావడంతో విక్రమ్ పాత్రలో ఆయన రెచ్చిపోయారు. తనకు లభించిన నిడివిలోనే ఆయన విక్రం పాత్రలో అదరగొట్టారు. సినిమా విజయంలో తన వంతు పాత్రను పోషించారు. సినిమా విజయానికి ఒక మూల స్తంభంలా నిలబడ్డారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఆయన ఇప్పుడు జోరు మీద ఉన్నారు.
తాజాగా ఆయన సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర చిత్రం చేస్తున్నాడు. సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. దీని తరువాత పాన్ ఇండియా చిత్రంగా టైగర్ నాగేశ్వరరావును లైన్ లో పెడుతున్నారు. ఇదిలా ఉంటే రవితేజ కి ఒక నాటి మిత్రుడైన కమల్ అనే నటుడు తాజాగా రవితేజకు సంబంధించిన పలు విషయాలను చెప్పుకొని వచ్చారు. సీతారామయ్యగారి మనవరాలు మూవీతో నేను హీరోగా పరిచయమయ్యాను. అప్పటికి రవితేజ ఇంకా హీరోగా కాలేదు. ఇప్పుడు ఎంత ఎనర్జీగా కనిపిస్తున్నాడో అప్పుడు అంతే ఎనర్జీతో ఉండేవారు. కాకపోతే కాస్త లావుగా కనిపించేవారు. కెరీర్ లో ఎంతో కష్టపడి తనను తాను మార్చుకొని యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు.
ఇప్పటికీ రవితేజ ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తారు. ఈ మధ్యనే రవితేజను కలిశాను. కెరీర్ ప్రారంభంలో హైదరాబాదులో ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఉంటే చాలు అనుకొని వచ్చాను. ఆ తరువాత వచ్చిందంతా బోనస్సే అని నాతో అన్నారు. అలాంటి రవితేజ ఇప్పుడు 12 కోట్లు విలువ చేసే ఇంట్లో ఉంటున్నారు. చిన్న పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు మాస్ మహారాజా గా అనిపించుకుంటున్నాడని రవితేజ పై కమల్ ప్రశంసల వర్షం కురిపించారు.