English | Telugu

వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఫైట్ చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్'

'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తయారవుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

8 రోజుల పాటు జరిగిన తొలి షెడ్యూల్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కల్యాణ్, వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తీశారు. వీటితో పాటు పలువురు పిల్లలతో ఎంటర్‌టైనింగ్ సీన్స్ తీశారు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లను, పోలీస్ స్టేషన్ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వీటిలో నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, అవినాశ్ ('కేజీఎఫ్' ఫేమ్) తదితర నటులు పాల్గొన్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో నిండిన కథతో భారీస్థాయిలో ఈ చిత్రం నిర్మాణమవుతోందనీ నిర్మాతలు తెలిపారు. 'గబ్బర్ సింగ్' కోసం మెమరబుల్ ఆల్బమ్‌ ని అందించిన సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్, మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారన్నారు.

అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అయనంకా బోస్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సాయి, ఎడిటర్‌గా చోటా కె. ప్రసాద్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.