English | Telugu
నేనింకా సింగిలే అంటున్న పూజా హెగ్డే
Updated : Apr 15, 2023
పూజా హెగ్డే ఇప్పుడు సౌత్‌లోనే కాదు, నార్త్ లోనూ సెన్సేషనల్ హీరోయిన్. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్‌ఖాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ తెగ పుకార్లు వచ్చేస్తున్నాయి పూజా హెగ్డే మీద. సిల్వర్ స్క్రీన్ అరవింద ఇప్పుడు నార్త్ లో సల్మాన్‌ఖాన్‌తో కిసీకా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో నటిస్తున్నారు. ఈద్‌కి విడుదల కానుంది ఈ చిత్రం. వెంకటేష్, రామ్ చరణ్ కూడా నటించారు. నార్త్ సినిమానే అయినా, సౌత్ కల్చర్‌ని రిఫ్లెక్ట్ చేసే పాటలు కూడా ఉన్నాయి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో. అయితే ఆ పాటల్లో నేటివిటీ అస్సలు లేదని, తెలిసీ తెలియని తనం బయటపడుతోందని అంటున్నారు అనుభవజ్ఞలు. మరోవైపు ఈ సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టేశారు పూజా హెగ్డే.
ఈ ప్రమోషన్లలో భాగంగా ఆమెకు సల్మాన్‌ఖాన్‌తో ప్రేమాయణం విషయం కూడా బయటపడింది. దీని గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ ``నేను సింగిల్‌గానే ఉన్నాను. నన్ను ఈ క్వశ్చన్ అడిగిన వారందరికీ ధన్యవాదాలు. నేను నా కెరీర్‌ని ఇష్టపడుతున్నాను. చాలా చాలా బిజీగా ఉన్నాను. కెరీర్ గురించి తప్ప, ఇంకే విషయం గురించీ ఆలోచించే తీరిక లేదిప్పుడు`` అని అన్నారు. ఆమె సల్మాన్ ఖాన్ గురించి చెప్పడం ఆపేసినంత మాత్రాన జనాలు ఆగలేదు. ఆమెను మరిన్ని ప్రశ్నలతో విసిగించారు. ఇలాంటి వార్తలు కంటపడినప్పుడు ఏమనిపిస్తుంది? అనేది మరో వ్యక్తి అడిగిన ప్రశ్న. ``నేను అలాంటివాటిని చూస్తూనే ఉంటాను. కానీ, పట్టించుకునే తీరిక ఉండదు. పట్టించుకుంటే కదా ఆలోచించాలి. సమాధానాలు చెప్పాలి. అందుకే నేను అసలు పట్టించుకోను`` అని అన్నారు. రియల్ లైఫ్ జాన్‌లో ఉండాల్సిన మూడు లక్షణాలను చెప్పమని మరొకరు కోరారు. ``మంచి మనసుండాలి. నమ్మకస్తుడై ఉండాలి. ప్రోత్సహించే గుణాలు ఉన్నవాడై ఉండాలి. అంతకు మించి ఇంకేమీ ఆలోచించను నేను`` అని అన్నారు పూజా హెగ్డే.