English | Telugu

పవన్- మహేష్ ల మధ్య పోటీ తప్పదా?!

ఇద్దరూ ఇద్దరే... ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ ఇద్దరి చిత్రాలు ఎప్పుడు పూర్తవుతాయో వారికే తెలియని పరిస్థితి ఏర్పడి ఉంది. విడుదల విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయనే దాంట్లో సందిగ్ధత నెలకొని ఉంది. పవనేమో రాజకీయాల వల్ల సినిమాలకు సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. దాంతో ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరోవైపు మహేష్ కుటుంబంలో వ‌రుస‌ విషాదాలు చోటు చేసుకున్నాయి. తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అతి తక్కువ వ్య‌వ‌ధిలో మరణించారు. దాంతో ఆయన చిత్రం షూటింగు వాయిదా పడుతూ వస్తోంది.

ఇలా పవన్- మహేష్ చిత్రాలు రెండు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇక విషయానికి వస్తే మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో ఎస్ ఎస్ఎంబి28 వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్- త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో అతడు, ఖ‌లేజా వంటి చిత్రాలు వచ్చాయి. దాదాపు పుష్కరకాలం అంటే 12 ఏళ్ల తర్వాత వీరి కాంబో మ‌రోసారి సెట్ అయింది. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 28న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత ఆగస్టు 11 అని అనుకున్నారు. కానీ వరుస విషాద సంఘటనల కారణంగా ఇప్పుడు ఈ చిత్రం దసరా కానుకగా విడుదల విడుదల కానుంది అని సమాచారం.

మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీర‌మ‌ల్లు విషయానికి వస్తే 17వ శతాబ్దం నాటి చారిత్రక కథనంతో ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. ఇదో పీరియాడికల్ ఫిలిం. ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాలు దొంగగా న‌టించ‌నున్నారు. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది. దాంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. మరోవైపు పవన్ రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ అనుకున్నట్లుగా జరగడం లేదు.

దాంతో ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు దసరాకు కన్ఫర్మ్ అని అంటున్నారు. అదే జరిగితే ఈసారి దసరా పోటీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు పోటీ పడటం ఖాయం. అదే జరిగితే విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఈ రెండు చిత్రాలపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. అంతే గాక ఈరెండు చిత్రాలతో తొలిసారిగా మ‌హేష్, ప‌వ‌న్ లు పాన్ ఇండియా బ‌రిలోకి దిగుతున్నారు. మరి ఏ చిత్రం అభిమానులను ప్రేక్షకులను మెప్పించి పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.