English | Telugu
ఆంధ్రా వారితో దిల్ రాజు వియ్యం... జైపూర్‌లో పెళ్లి!
Updated : Oct 28, 2023
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలకు సమయం వచ్చినట్లుంది. మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీలో పెళ్లి చేసుకోనున్నారు. మరో వైపు హీరో వెంకటేష్ రెండో కుమార్తె వివాహం కూడా జరగనుంది. రీసెంట్‌గానే నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి రెండో తనయుడు, హీరో శ్రీసింహ, మురళీ మోహన్ మనవరాలితో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో తెలుగు చిత్రీసీమకు చెందిన మరో ప్రముఖ వ్యక్తి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు.. దిల్ రాజు. ఈ అగ్ర నిర్మాత సోదరుడు, శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన దిల్‌రాజు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో వియ్యమందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరిలో పెళ్లి జరనుంది. మ్యారేజ్‌ను జైపూర్‌లో ఘనంగా నిర్వహించాలని అనుంటున్నారు. నిజానికి ఆశిష్ పెళ్లి గురించి ఆగస్ట్ నుంచి వార్తలు వినిపించాయి. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు కలిసి మాట్లాడుకున్నారు. దిల్ రాజు తరపున సుకుమార్ సైతం ఆశిష్ పెళ్లి పెద్దగా మాటా మంతీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు న్యూస్ వినిపించింది.
సినీ నిర్మాణ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తూ వచ్చిన ఆశిష్ రెడ్డి గత ఏడాది విడుదలైన రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా మారారు. దానికి శ్రీహర్ష దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. తమ హోం బ్యానర్ అయిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.