English | Telugu

ఎస్ఎస్ఎంబి28 విషయంలో రోజుకు ఒకరి పేరు వినిపిస్తోంది!?

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎస్ఎస్ఎంబి 28 వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్ మూవీ గా 12 ఏళ్ల తర్వాత ఈ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇందులో హీరో హీరోయిన్లు కాకుండా ఓ కీలక పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం మొదట ట‌బు పేరు వినిపించింది. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ పేరు వినిపించింది. మధ్యలో శోభన పేరు కొంతకాలం హడావుడి చేసింది. తాజాగా ఆ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ న‌టిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. పూజ హెగ్డే , శ్రీ‌లీలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు నెగటివ్ రోల్ పోషిస్తున్నారు. దసరాకి ఈ సినిమా ధియేటర్ లోకి విడుదల కానుంది.

ఎట్ట‌కేల‌కు బాహుబ‌లిలో శివ‌గామిగా మెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ను చేయ‌డానికి ఓకే చెప్పింద‌ని స‌మాచారం. శోభనా కోసం పలు ప్రయత్నాలు చేసినా ఆమె ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న కారణంగా వీలు కాలేదట. ఈ సినిమాలో చేయడానికి ఆమె పెద్ద‌గా ఆసక్తి చూప లేదట. దాంతో ఆమె స్థానంలో రమ్యకృష్ణ తీసుకోవాలని టీం ఆలోచిస్తుంది. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ పెరిగిపోయింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తోంది. ఇప్పటివరకు ఆమె మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌లేదు. ఆమెకి ఎంతో కాలంగా త్రివిక్ర‌మ్ చిత్రంలో న‌టించాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. కానీ అది ఇప్ప‌టివ‌ర‌కు నెర‌వేర‌లేదు. ఇంత‌కాలానికి ఆమెకి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో చేసే అవ‌కాశం ల‌భించింద‌ని స‌మాచారం. ఇక ఆమె మ‌హేష్ బాబు చిత్రంలో న‌టిస్తే ఆ చిత్రానికి ఖ‌చ్చితంగా నిండుద‌నం వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే యూనిట్ కాస్త వెరైటీగా ఉంటుంద‌ని భావించి శోభ‌న కోసం ఇంకా త‌మ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూ నే ఉన్నారు. మొత్తానికి ఈ పాత్రలో రమ్యకృష్ణ, శోభనాల లో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.