English | Telugu
జీడీ నాయుడు కేరక్టర్‌లో ఆర్ మాధవన్!
Updated : Apr 8, 2023
ఇండియన్ ఇన్వెంటర్, ఇంజినీర్ గోపాలస్వామి దురైస్వామి నాయుడు (జీడీ నాయుడు) జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో నటించడానికి ఓకే చెప్పేశారు వెర్సటైల్ యాక్టర్ ఆర్ మాధవన్. ఇటీవల రాకెట్రీ నంబి కేరక్టర్‌లో నటించారు మాధవన్. ఆ సినిమాకు ఇంకా ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇంతలోనే మరో రియల్ లైఫ్ కేరక్టర్‌కి ఓకే చెప్పేశారు ఆర్.మాధవన్. ఎడిసన్ ఆఫ్ ఇండియా అనే పేరుంది జీడీ నాయుడికి. ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటర్ కనిపెట్టిన ఘనత ఆయనదే. మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ రంగాలకు తనదైన సేవ చేసిన ఘనత జీడీ నాయుడు సొంతం. గతంలో 2019లో జీడీ నాయుడు - ది ఎడిసన్ ఆఫ్ ఇండియా పేరు మీద ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా చేసిన బయోపిక్‌కి బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిల్మ్ అవార్డు కేటగిరీలో 66వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ బహుమతి దక్కింది.
లేటెస్ట్ గా మాధవన్‌తో తెరకెక్కిస్తున్న ప్రాజెక్టును మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ``మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ జీడీ నాయుడు చారిటీస్‌తో బయోపిక్ చేయడానికి సైన్ చేసుకుంది. ఆయన మిరాకిల్ మేన్. ఆయన జీవితం, ఆయన సాధనలను ఆధారంగా చేసుకుని సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. మాధవన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు`` అని ట్వీట్ చేశారు మేకర్స్.
జీడీ నాయుడు చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీ, జీడీ నాయుడు మనవడు, జీడీ గోపాల్ తనయుడు అయిన జీడీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ``ఈ సినిమాను తీయడంలో ప్రధాన ఉద్దేశం నేటి యువతలో స్ఫూర్తి నింపడమే. సైన్స్, ఇన్నొవేషన్‌లో మన యువతకు స్ఫూర్తి కలిగించడమే. మా తాతయ్య ఎన్నో విషయాలను కనిపెట్టి రికార్డులకెక్కారు. ఆయన మెమొరియల్ గ్యాలరీలో వాటన్నిటినీ భద్రపరిచాం. ఇప్పుడు తీస్తున్న సినిమా దానికి కొనసాగింపు మాత్రమే`` అని అన్నారు.
కృష్ణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.