English | Telugu
రేలంగి మావయ్య కాదు.. మాస్ అమ్మ మొగుడు!
Updated : Sep 11, 2023
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'పెద కాపు'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలతో క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల.. 'నారప్ప' నుంచి ట్రాక్ మార్చాడు. ఇక ఇప్పుడు 'పెద కాపు'తో అసలుసిసలైన మాస్ చూపించబోతున్నాడని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. విజువల్స్, మ్యూజిక్, డైలాగ్స్ పరంగా ట్రైలర్ ఎంతో ఇంటెన్స్ గా సాగింది. "మీద చెయ్యేసినప్పుడే తలకాయలు తీసుంటే నా కొడకా ఇంతదూరం వచ్చేది కాదు", "మీకే అంతుంటే మాకెంతుండాల్రా" వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ విలేజ్ పొలిటికల్ డ్రామాతో శ్రీకాంత్ అడ్డాల బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేలా ఉన్నాడు. ఈ సినిమాలో ఆయన ఒక పవర్ ఫుల్ పాత్ర కూడా పోషిస్తుండటం విశేషం. ఆయన మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్ లో దర్శకుడిగా అడ్డాల మార్క్ ఎంత కనిపించిందో.. నటుడిగానే అదే స్థాయి మార్క్ చూపించాడు. మొత్తానికి తన డైరెక్షన్ తో, యాక్టింగ్ తో బిగ్ స్క్రీన్ పై శ్రీకాంత్ అడ్డాల అసలుసిసలైన మాస్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.