English | Telugu
జంధ్యాలతో పోల్చడం ఇబ్బందిగా వుంది
Updated : Jul 7, 2014
మూడు వారాలుగా విజయవంతంగా కొనసాగుతున్న చిన్న సినిమా ఊహలు గుసగుసలాడే. చిన్న సినిమా సాధించిన ఈ పెద్ద విజయంతో చాలా హ్యాప్పీగా ఉన్నారు చిత్ర యూనిట్ అంతా. ముఖ్యంగా ఏ సెంటర్, మల్టీప్లెక్స్ ల్లో మాత్రమే బాగా ఆడుతుందని మొదట్లో అనుకున్నా ఈ చిత్రం ఇప్పుడు బి సెంటర్లలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ ఫిలిం మొదటి రోజు కలెక్షన్లు కూడా పూరే. అయినా ఆ తర్వాత మౌత్ టాక్ తో మంచి కలెక్షన్లు వస్తున్నాయని చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెలిపారు. మూడో వారం నుంచి ఈ సినిమా ప్రదర్శన థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.
క్లీన్ కామెడీతో సాగిపోయే ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ఆడియన్స్ అభిమానించడం ఆనందంగా వుందన్నారు. సినిమా చూసి ప్రేక్షకులు చాలామంది తమ అభినందనలను, ఆనందాన్ని తెలియచేస్తున్నందుకు మరింత సంతోషాన్నించిందన్నారు. సినిమా చూసిన వారు జంధ్యాల సినిమా చూసినట్లుందని అంటున్నారు. ఈ విషయం ప్రస్తావించినప్పుడు, జంధ్యాల చాలా గొప్పవారు, నేను ఆయనంతటి వాడిని కాను. అంతటి గొప్ప వ్యక్తితో పోల్చడం ఇబ్బందిగా వుంటుందన్నారు అవసరాల శ్రీనివాస్. అయితే జంధ్యాల సినిమాలు చూసినప్పుడు కలిగే ఆనందం తన సినిమా చూసినప్పుడు కలిగితే మాత్రం ఆనందమే అని చెప్పారు.