English | Telugu

Mana Shankara Vara Prasad Garu Review: మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ రివ్యూ 

తారాగణం: చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథ‌రిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీఓపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
బ్యానర్స్: షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: జనవరి 14, 2026

చాలారోజుల తరువాత 'మన శంకర వరప్రసాద్‌ గారు' రూపంలో మెగాస్టార్ చిరంజీవి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశారు. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనిల్ రావిపూడి దీనికి దర్శకత్వం వహించారు. పైగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఇన్ని ప్రత్యేకలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..? (Mana Shankara Vara Prasad Garu Review)

కథ:

శంకర వరప్రసాద్‌(చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. సెంట్రల్ మినిస్టర్ దగ్గర చీఫ్ సెక్యూరిటీగా వర్క్ చేస్తుంటాడు. మనిషి సరదాగా ఉంటాడు కానీ, పవర్ ఫుల్ ఆఫీసర్. ఎలాంటి సిట్యుయేషన్ నైనా హ్యాండిల్ చేయగలడు. అలాంటి వరప్రసాద్‌ కి ఒక బాధ ఉంది. ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ వుమెన్ అయిన తన భార్య శశిరేఖ(నయనతార)తో తనకి ఆరేళ్ళ క్రితం విడాకులు అయ్యాయి. ఇద్దరు పిల్లలు తల్లితోనే ఉంటారు. వారికి తండ్రి ఫేస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. పైగా తాతయ్య(సచిన్ ఖేడేకర్) చెప్పిన మాటలతో తండ్రిని ద్వేషిస్తారు. అలాంటి ఆ ఇద్దరి పిల్లలకు దగ్గరవ్వాలనుకుంటాడు వరప్రసాద్. పిల్లలు డెహ్రాడూన్ బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్నారని తెలిసి అక్కడికి వెళ్తాడు. మరి వరప్రసాద్ తన పిల్లలకు దగ్గరయ్యాడా? విడిపోయిన వరప్రసాద్‌, శశిరేఖ మళ్ళీ కలిశారా? శశిరేఖ కుటుంబానికి ఉన్న ఆపద ఏంటి? దాని నుంచి వరప్రసాద్ ఎలా కాపాడాడు? ఇందులో వెంకీ గౌడ(వెంకటేష్) పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

కథ చాలా చిన్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలవడం. తులసి, విశ్వాసం వంటి సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అయితే ఇందులో భార్యాభర్తలు విడిపోవడానికి బలమైన కారణం ఉండదు. తిరిగి కలవడానికి బలమైన ఎమోషన్ కూడా ఉండదు. కానీ, ఈ చిన్న కథను లైటర్ వేలో నడిపిస్తూ రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఎంటర్టైన్మెంట్ ని అందించడంలోఆరితేరిన అనిల్ రావిపూడి.. మరోసారి బాగానే నవ్వించగలిగాడు.

సినిమా ప్రారంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి కానీ.. ఆ తర్వాత అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఫస్ట్ హాఫ్ సరదాగా నడిచిపోతుంది. ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ప్రతి సీన్ ని మలిచారు. ఓ వైపు చిరంజీవి వింటేజ్ లుక్స్, ఫైట్స్, డ్యాన్స్ లు.. మరోవైపు మెగా మార్క్ కామెడీ. దాంతో అసలు పెద్ద కథ లేదు, ఉన్న కథ కూడా ముందుకు నడవట్లేదు అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు.

చిరంజీవి, నయనతార మధ్య లవ్ ట్రాక్ ని డిజైన్ చేసిన తీరు బాగుంది. మాటలతో కాకుండా కేవలం సైగలతోనే ఒకరికొకరు పరిచయమవుతారు. అలాగే వారు కలిసిన ప్రతిసారీ బ్యాక్ గ్రౌండ్ లో దళపతి సినిమాలోని 'సుందరి' సాంగ్ వినిపించడం భలే ఉంది. ఫస్ట్ హాఫ్ లో స్కూల్ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. శశిరేఖ కుటుంబానికి ఆపద రావడం, వారికి సెక్యూరిటీగా వరప్రసాద్ రంగంలోకి దిగడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.

ఓ వైపు శశిరేఖకు దగ్గర అవ్వడానికి వరప్రసాద్ ప్రయత్నాలు, మరోవైపు వారిని దూరంగా ఉంచడానికి మామ(సచిన్ ఖేడేకర్) ప్రయత్నాలతో.. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తీరు కూడా బాగుంది. సెక్యూరిటీ పేరుతో వరప్రసాద్ చేసే హడావుడి, హోటల్ లో అమ్మాయిల మనస్తత్వం గురించి చెప్పే సీన్ వంటివి బాగా నవ్వించాయి.

అయితే సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ, కథ చెప్పడానికి ఏం లేకపోవడంతో అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. విలన్ ట్రాక్ కూడా ఏమాత్రం ప్రభావవంతంగా లేదు. ఇక ఎంతో హైప్ ఇచ్చిన వెంకటేష్ ట్రాక్ కూడా చెప్పిన స్థాయిలో అయితే లేదు. కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక.. ఇరికించినట్లుగా ఉంది. క్లైమాక్స్ లో చిరంజీవి, వెంకటేష్ ఫైట్ ఎపిసోడ్స్ ఎడిటింగ్ కూడా తేలిపోయింది. అయితే ఆ ట్రాక్ ని డిజైన్ చేసిన తీరు ఎలా ఉన్నా.. చిరంజీవి, వెంకటేష్ కలిసి తెరపై కనిపించడం మాత్రం అభిమానులకు మంచి అనుభూతి అని చెప్పవచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

శంకర వరప్రసాద్‌ పాత్రలో చిరంజీవి యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా, భార్యపిల్లలకు తిరిగి దగ్గరవ్వాలనుకునే వ్యక్తిగా ఆ పాత్రను అలవోకగా చేసుకుంటూ పోయారు. లుక్స్, యాక్షన్, డ్యాన్సుల్లో అదరగొట్టారు. చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. తన ఓల్డ్ సినిమాలలో కామెడీని గుర్తుచేసేలా.. నవ్వులు పూయించారు. తన కామెడీ టైమింగ్ తోనే సినిమాని నిలబెట్టారంటే అతిశయోక్తి కాదు.

వరప్రసాద్‌ భార్య శశిరేఖ పాత్రలో నయనతార మెప్పించింది. ఆ పాత్రకు తగ్గట్టుగా హుందాతనాన్ని, పొగరుని చక్కగా ప్రదర్శించింది. ఇక చిరు-నయన్ మధ్య గిల్లికజ్జాలు ఆకట్టుకున్నాయి. కర్ణాటక బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడగా వెంకటేష్ కనిపించేది కాసేపే అయినప్పటికీ.. తన స్క్రీన్ ప్రజెన్స్ తో మ్యాజిక్ చేశారు. చిరు-వెంకీ కలిసి కామెడీ చేయడం, డ్యాన్స్ లు వేయడం ఫ్యాన్స్ కి ఫీస్ట్. వరప్రసాద్ మామగా సచిన్ ఖేడేకర్ బాగానే నవ్వించారు. కేథ‌రిన్ థ్రెసా, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం తదితరులు పాత్రల పరిధి మేర నటించారు.

కథకుడిగా, దర్శకుడిగా అనిల్ రావిపూడి పరవాలేదు అనిపించుకున్నాడు. బాగానే నవ్వించాడు కానీ, 'సంక్రాంతికి వస్తున్నాం' స్థాయిలో అయితే నవ్వించలేకపోయాడు. ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన సినిమా అయినప్పటికీ.. అందుకు తగ్గ బలమైన కథను ఎంచుకోలేదు. కథాకథనాల కంటే కూడా సీన్స్ నుంచి పుట్టే కామెడీపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. తదుపరి సినిమాలకు కూడా ఇదే ఫార్మాట్ ని ఫాలో అయితే.. ఆడియన్స్ కి బోర్ కొట్టే అవకాశముంది.

సాంకేతికంగా మన శంకర వరప్రసాద్‌ గారు చిత్రం బాగానే ఉంది. ముఖ్యంగా భీమ్స్ సిసిరోలియో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా విడుదలకు ముందే పాటలు మంచి ఆదరణ పొందాయి. నేపథ్య సంగీతంతోనూ భీమ్స్ బాగానే ప్రభావం చూపాడు. తెర మీద హీరో చిరంజీవి అయితే, తెరవెనుక హీరో భీమ్స్ అన్నట్టుగా కొన్ని సీన్స్ లో మ్యూజిక్ ఉంది. సమీర్ రెడ్డి కెమెరా పనితనం ఆకట్టుకుంది. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయొచ్చు.డైలాగ్స్ బాగా పేలాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా...

సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకొని తీసిన ఈ సినిమా.. నవ్వించడంలో బాగానే సక్సెస్ అయింది. అయితే కథాకథనాలు, లాజిక్స్ అనే ఆలోచనతో సినిమాకి వెళ్తే మాత్రం నిరాశచెందుతారు. వింటేజ్ మెగాస్టార్ ని చూడాలి, కాసేపు సరదాగా నవ్వుకోవాలి అనుకుంటే ఈ సినిమాకి హ్యాపీగా వెళ్ళొచ్చు.

రేటింగ్: 2.75/5

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.