English | Telugu
ఆచార్య దెబ్బ.. మొదటిసారి చిరంజీవిని టార్గెట్ చేసిన కొరటాల!
Updated : Sep 20, 2024
'మిర్చి' వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ (Koratala Siva).. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కొరటాలకు 'ఆచార్య' రూపంలో ఘోర పరాజయం ఎదురైంది. చిరంజీవి, రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాదు, ఈ చిత్రం కారణంగా చిరంజీవి, కొరటాల మధ్య దూరం కూడా ఏర్పడింది. ఆచార్య పరాజయానికి కొరటాలే కారణమనే అర్థమొచ్చేలా అప్పట్లో చిరంజీవి కామెంట్స్ చేశారు. తమ ఇన్నేళ్ల సీనియారిటీతో సినిమా చేసేటప్పుడు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తామని.. అవి పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని.. కొందరు పాటించకనే చేదు ఫలితాయి వచ్చాయి అన్నట్టుగా అప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు.. పరోక్షంగా కొరటాలను టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయి. ఆచార్య వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఆ ఫెయిల్యూర్ పై కొరటాల స్పందించిన సందర్భాలు లేవు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాంటి కొరటాల మొదటిసారి చిరంజీవిపై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత కూడా.. తనకు 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల ప్రతిభ మీద నమ్మకంతో జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' (Devara) సినిమా చేశాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హోస్ట్ లుగా ఎన్టీఆర్, కొరటాల ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో "మీరు భయం గురించి సినిమా చేశారు కదా.. మరి మీరు దేనికి భయపడతారు?" అని కొరటాలను సిద్ధు ఆసక్తికర వేశాడు. దీనికి కొరటాల సంచలన సమాధానం చెప్పాడు. "మనకి ఇచ్చిన పనికి మనం జవాబుదారీ. ఆ పనిని పూర్తి చేయాలనే భయంతో, మనం దానిని పూర్తి చేస్తే.. ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. ఎవడి పని వాడు చేస్తే.. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనది మనం చెయ్యక.. పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి, ఆయన్ని ఇబ్బందిపెట్టి.. ఇలాంటి చేస్తేనే సమస్య." అని కొరటాల అన్నాడు.
అయితే కొరటాల చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేసినట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 'ఆచార్య' విషయంలో కొరటాల పనిని కొరటాలను చేసుకోనివ్వలేదని, చిరంజీవి కథను మార్చేలా చేశారని సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఉంది. కొరటాల తాజా కామెంట్స్.. ఆ ప్రచారాన్ని గుర్తు చేసేలా ఉన్నాయి.