English | Telugu
అప్పుడూ.. ఇప్పుడూ రజినీకాంతే.. రేర్ రికార్డ్
Updated : Aug 22, 2023
సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతకు ముందు తలైవా నటించిన ఆరు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ ‘జైలర్’ సక్సెస్ వాటన్నింటినీ మరపించేసింది. ఈ సినిమా సాధించిన కలెక్షన్స్‌పై ఆయన అభిమానులు, కోలీవుడ్ వర్గాలు, ట్రేడ్ పండితులు అందరూ హ్యాపీగానే ఉన్నారు. రోజు రోజుకీ ఈ మూవీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.
తాజాగా రజినీకాంత్ తన ‘జైలర్’ సినిమాతో టాలీవుడ్‌లో ఓ రికార్డ్ క్రియేట్ చేయటం విశేషం. అదేంటంటే.. ఇప్పటి వరకు మరే కోలీవుడ్ స్టార్ తెలుగు మార్కెట్‌లో రూ.50 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేయలేదు. తొలిసారి తలైవా, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 మూవీ ఆ రేర్ ఫీట్‌ను సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇప్పుడు ‘జైలర్’ సినిమా కూడా ఆ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. మూవీ విడుదలైన పదకొండు రోజులకే రూ.68 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇదే జోరు మరో వారం కొనసాగితే సులభంగా 2.0 రికార్డుని జైలర్ అధిగమిస్తుందని మీడియా వర్గాలంటున్నాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. రజినీకాంత్‌తో టైటిల్ పాత్రలో నటించగా సౌత్ సూపర్‌స్టార్స్ మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ అతిథి పాత్రల్లో అదరగొట్టారు. వసంత్ రవి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, వినాయకన్ ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు.