English | Telugu
'సింహాద్రి' ఇండస్ట్రీ హిట్ కాదా?
Updated : Apr 10, 2023
ఇప్పుడు మా సినిమా అంత వసూలు చేసింది, ఇంత వసూలు చేసింది అని చెప్పుకుంటున్నారు కానీ, ఒకప్పుడు మాత్రం సినిమా ఎన్ని రోజులు ఆడిందని చూసేవాళ్ళు. ఆ పరంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'సింహాద్రి' సినిమా సినీ చరిత్రలో ఎప్పటికీ చెక్కు చెదరని రికార్డుని సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. 50 రోజులు, 100 రోజులు పరంగా సింహాద్రి రికార్డులను బ్రేక్ చేసిన సినిమాలు ఉన్నాయి కానీ.. 175 రోజుల రికార్డును మాత్రం ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. భవిష్యత్తులో కూడా అసలు ఆ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంత గొప్ప సినిమా అయినా కూడా మూడు, నాలుగు వారాలు ఆడటమే గొప్ప అన్నట్టుగా మారింది. 50 రోజులు ఆడటమే వింత అయిపొయింది. ఈ లెక్కన సింహాద్రి 175 రోజుల రికార్డు బ్రేక్ అయ్యే అవకాశమే లేదు. అందుకే సింహాద్రిని ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వంగా చెబుతుంటారు. అయితే కలెక్షన్ల పరంగా చూస్తే సింహాద్రి సినిమా ఇండస్ట్రీ హిట్ కాదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు.
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సింహాద్రి'ని రీరిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇదే ఇప్పుడు అసలు 'సింహాద్రి' సినిమా ఇండస్ట్రీ హిట్టా కాదా? అనే చర్చకు మరోసారి దానితీసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమా కలెక్షన్లను దాటకుండా 'సింహాద్రి' ఇండస్ట్రీ హిట్ ఎలా అవుతుందని మెగా అభిమానులు వాదిస్తున్నారు. అయితే నందమూరి అభిమానులు మాత్రం.. 'ఇంద్ర' కలెక్షన్లను కావాలని ఎక్కువగా చేసి చూపించి, 'సింహాద్రి' ఇండస్ట్రీ హిట్ కాదని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో సింహాద్రి ఇండస్ట్రీ హిట్ విషయంలో మెగా-నందమూరి అభిమానుల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది.
2002 విడుదలైన 'ఇంద్ర' సినిమా 100, 175 రోజుల సెంటర్లు, కలెక్షన్ల పరంగా అప్పటిదాకా ఉన్న రికార్డులను బద్దలుకొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఆ మరుసటి ఏడాదే 2003 లో విడుదలైన 'సింహాద్రి' సినిమా ఇంద్ర రికార్డులను బ్రేక్ చేసింది. ఇంద్ర సినిమా 118 సెంటర్లలో వంద రోజులు, 32 సెంటర్లలో 175 రోజులు ఆడగా.. సింహాద్రి సినిమా 145 సెంటర్లలో వంద రోజులు, 55 సెంటర్లలో 175 రోజులు ఆడింది. సింహాద్రి దెబ్బకి ఏడాదికే ఇంద్ర 100, 175 రోజుల సెంటర్ల రికార్డులు బ్రేక్ అయ్యాయి. అయితే కలెక్షన్ల పరంగా ఇంద్ర రూ.29 కోట్ల షేర్ రాబట్టగా, సింహాద్రి మాత్రం రూ.26 కోట్ల షేరే రాబట్టిందని.. కాబట్టి సింహాద్రి ఇండస్ట్రీ హిట్ అవ్వదని మెగా అభిమానుల వాదన. కానీ నందమూరి అభిమానుల వాదన మరోలా ఉంది. అప్పటికింకా కలెక్షన్ల ట్రాకింగ్ ఈ స్థాయిలో లేదు. మేకర్స్ పోస్టర్ లో వేసిందే కలెక్షన్. మొదట ఇంద్ర సినిమా రూ.26 కోట్ల షేర్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని ప్రచారం చేశారని, కానీ ఎప్పుడైతే సింహాద్రి కొన్ని లక్షల తేడాతో ఇంద్ర టోటల్ షేర్ దాటేసిందో.. అప్పటినుంచి ఇంద్ర సినిమా రూ.28-29 కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్లు ప్రచారం మొదలుపెట్టారని నందమూరి అభిమానులు అంటున్నారు. ఒక సినిమా రికార్డుని మరో సినిమా బ్రేక్ చేయడం కామన్ అని.. ఇంద్ర, సింహాద్రి రెండూ కూడా ఇండస్ట్రీ హిట్లే అని, దీనిపై వాదన అనవసరం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పట్లో ఈ వాదన ఆగేలా లేదు.