English | Telugu
గమ్యం సంగీత దర్శకుడు అనిల్ మృతి
Updated : Apr 21, 2011
"గమ్యం" చిత్రానికి సంగీతం అందించిన సంగీత దర్శకుడు అనిల్ మృతి. వివరాల్లోకి వెళితే యువ సంగీత దర్శకుడు అనిల్ ఏప్రెల్ 21 రాత్రి 11 గంటలకు గుండెపోటుతో మరణించారు. అనిల్ తొలిసారిగా "సంభవామి యుగే యుగే" చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా తెలిగు సినీ పరిశ్రమలో ప్రవేశించారు. అనంతరం అల్లరి నరేష్, శర్వానంద్, కమలినీ ముఖర్జీలు నటించగా, క్రిష్ ( జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో వచ్చిన "గమ్యం" చిత్రంతో అనిల్ కు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఈ "గమ్యం" చిత్రంలోని "ఎంరవరకూ ఎందుకొరకూ" అనే పాట వ్రాసినందుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మన రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డు లభించింది.
అనంతరం "నిన్న నేడు రేపు" చిత్రానికి, అనంతరం నిఖిల్ హీరోగా, దమ్మాలపాటి నిర్మించిన "కళావర్ కింగ్" చిత్రానికీ, ఇటీవల వచ్చిన "యల్ బి డబ్ల్యూ" క్యాప్షన్ "లైఫ్ బిఫోర్ వెడ్డింగ్" చిత్రానికీ అనిల్ సంగీతం అందించారు. ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న యువ సంగీత దర్శకుడు అనిల్ అకాల మరణం తెలుగు సినీపరిశ్రమకు తీరని లోటు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆత్మకు శాంతి కలగాలని తెలుగువన్ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది.