English | Telugu
పవర్ స్టార్ 'ఓజీ'లో విలన్ గా ఇమ్రాన్ హష్మీ!
Updated : Jun 15, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెట్స్ నుంచి విడుదలైన పవన్ పిక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపడం చూస్తుంటే పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేయడం ఖాయమనిపిస్తోంది.
'ఓజీ'లో కీలక పాత్రల్లో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి నటిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. ఇమ్రాన్ హష్మీకి ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. వరుస హిందీ సినిమాలతో బిజీగా ఉండే ఇమ్రాన్ హష్మీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పవన్ ఇమేజ్ కి తగ్గట్లు ఆయనను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేయడం మంచి నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇమ్రాన్ హష్మీ రాకతో 'ఓజీ'పై నార్త్ ప్రేక్షకుల దృష్టి పడే అవకాశముంది. పైగా 'సాహో'తో దర్శకుడు సుజీత్ కూడా నార్త్ ప్రేక్షకులకు సుపరిచితమే. 'సాహో' సినిమా హిందీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొని, భారీ వసూళ్లతో అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు పవర్ స్టార్ 'ఓజీ'తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేలా సుజీత్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది.