English | Telugu

గాయని చిత్ర కుమార్తె అంత్యక్రియలు

గాయని చిత్ర కుమార్తె అంత్యక్రియలు ఏప్రెల్ 15 వ తేదీ సాయంత్రం చెన్నైలో జరిగాయి. ప్రముఖ గాయని చిత్ర తన తీయని కమఠ స్వరంతో కోట్లాది అది శ్రోతల వీనుల్లో అమృతం నింపితే, ఆమె జీవితంలో మాత్రం దయలేని ఆ భగవంతుడు హలాహలాన్నే నింపాడు. వివరాల్లోకి వెళితే ఈవిడ అసలు పుట్టటమే చిరునవ్వుతో పుట్టిందా అన్నట్టు ఎప్పుడూ కల్లాకపటం లేని చక్కని చిరునవ్వుతో అందరినీ పలకరించే గాయని చిత్రకు దారుణమైన గర్భశోకం కలిగింది.

 

గాయని చిత్ర, విజయ్ శంకర్ దంపతులకు వివాహం జరిగిన పదిహేనేళ్ళకు ఎన్నో నోముల, వ్రతాల, పూజల ఫలితంగా లేక లేక కలిగిన ఏకైక సంతానం బేబీ నందన. షార్జా స్టేడియంలో జరుగబోయే రెహమాన్ సంగీత విభావరిలో పాల్గొనేందుకు సకుటుంబంగా గాయని చిత్ర దుబాయ్ కి వెళ్ళారు. అక్కడ ఒక రిసార్ట్ లో విల్లాలో చిత్ర కుటుంబానికి బస ఏర్పాటు చేశారు. కానీ ఆ విల్లాలోని స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తూ బేబీ నందన మరణించటంతో చిత్ర మోములో చెరగని చిరునవ్వు చెరిగింది. విషాదమంటే తెలియని చిత్రకు ఘోరమైన దుఃఖమే మిగిలింది. ఆమె శోకం వర్ణనాతీతమైంది. ఏప్రెల్ 14 వ తేదీ చిత్ర జీవితంలో అంతులేని విషాదాన్నే మిగిల్చింది. చిత్ర కుమార్తె శవాన్ని ఏప్రెల్ 15 వ తేదీ, శుక్రవారం ఉదయం చెన్నైకి తీసుకు వచ్చారు.

 

గాయని చిత్రను చూసిన ఆమె బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఆ మాతృమూర్తి ఆక్రోశాన్ని, ఆవేదనను, బాధను, దుఃఖాన్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు. ఆమెను ఓదార్చటం వారికి శక్తికి మించిన పనే అయ్యింది. ఆ మాతృమూర్తి గర్భశోకాన్ని అర్థం చేసుకోని కాలం నిర్దయగా బేబీ నందనను తనలో కలిపేసుకుంది. బేబీ నందన అంత్యక్రియలు ఏప్రెల్ 15 వ తేదీ సాయంత్రం చెన్నైలో జరిగాయి.

 

"జాతస్య హి ధృవో మృత్యః ధృవం జన్మ మృతస్యచ" అని గీతాచార్యడన్నట్లుగా జన్మించిన వారు మరణించక తప్పదు. మరణించిన వారు మరల జన్మించక తప్పదు. ఇట్టి అనివార్యములైన జనన మరణముల గూర్చి శోకించుట తగదు. కానీ ఒక్కగానొక్క కూతురు మరణిస్తే బాధపడకుండా ఉండటం మనుషుల వల్ల సాధ్యమవుతుందా...? అయినా చిత్ర ఈ గర్భశోకాన్ని భరించగలిగే శక్తిని ఆ భగవంతుడామెకీయాలని తెలుగువన్ ఆశిస్తోంది.