English | Telugu
ఆటోలతో 'బేబీ'.. ఇదెక్కడి ప్రమోషన్ రా మావా!
Updated : Jul 11, 2023
ఇటీవల కాలంలో పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. 'హృదయ కాలేయం' అనే కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయి రాజేష్, 'కలర్ ఫొటో' సినిమాకి రచయితగా, నిర్మాతగా వ్యవహరించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన దర్శకుడిగా 'బేబీ' అనే ట్రయాంగిల్ లవ్ స్టొరీతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలవనుందని పాటలను బట్టి అర్థమైపోయింది. ఇక టీజర్, ట్రైలర్‌లోని ప్రేమ సన్నివేశాలు, సంభాషణలు హత్తుకున్నాయి. దీంతో సినిమాకు ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది. ముఖ్యంగా యువత ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందమంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. నిర్మాత ఎస్‌కేఎన్, ఆనంద్, వైష్ణవి, విరాజ్ అశ్విన్‌లు ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే హీరో ఆనంద్ దేవరకొండ ఇందులో ఆటో డ్రైవర్‌గా కనిపిస్తున్నాడు. అందుకేనేమో బేబీ టీమ్ ఆటోలతో వినూత్నంగా ప్రచారం చేస్తోంది. వందకు పైగా ఆటోలను ఒక దగ్గరకు తీసుకొచ్చి, 'BABY JULY 14' అని వచ్చేలా వాటిని వరుసగా పార్క్ చేశారు. సినిమా రిలీజ్ డేట్‌ను బలంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తూ బేబీ మూవీ టీమ్ చేసిన వినూత్న ప్రమోషన్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఆటోల ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.