English | Telugu

వాష్ రూమ్ కోసం ‘బేబి’ హీరోయిన్ రిక్వెస్ట్.. నానా మాటలన్న ఆర్టిస్ట్

రంగం ఏదైనా ఎంత తెలివైన వాడైనా సక్సెస్ ఉంటేనే ఎవరి మాటైనా చెల్లుతుంది. అప్పటి వరకు మనం పట్టించుకోని వ్యక్తులు సక్సెస్ తర్వాత మనల్ని చూసే కోణం మారిపోతుంది. ఇప్పుడలాంటి ఎమోషనల్ ఫీలింగ్ ను ఫేస్ చేస్తోన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. బేబి సినిమాతో ఈమెకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకు ముందు సినిమాల్లో చిన్నా చితక పాత్రలు చేయటమే కాకుండా ఆల్బమ్స్, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ వచ్చింది. అయితే బేబి సినిమాతో వైష్ణవి రేంజ్ మారిపోయింది. యూత్ లో మంచి గుర్తింపు దక్కింది.

అయితే జర్నీలో వైష్ణవి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. తన లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలపై స్పందించింది. ''పదవ తరగతిలోనే కుటుంబ బాధ్యతలను తీసుకున్నాను. ఈవెంట్స్ కు వెళ్లి డాన్స్ చేసేదాన్ని. ఆ డబ్బుతో కుటుంబం నడిచేది. ఇక యూ ట్యూబ్ వీడియోల్లో నటించేటప్పుడు డ్రెస్ మార్చుకోవటానికి గది ఉండేది కాదు. వాష్ రూమ్ కి వెళ్లి దుస్తులు మార్చుకునే దాన్ని. ఓ సారి సినిమాలో చిన్న పాత్రలో నటిస్తున్నాను. వాష్ రూమ్ వెళ్లాలనిపించి పెద్ద ఆర్టిస్ట్ దగ్గరకు వెళ్లి వాష్ రూమ్ వాడుకోవచ్చా? అని రిక్వెస్ట్ చేస్తే ఆమె నానా మాటలంది. ఏడవటం మాత్రమే తక్కువైంది. అంతే కాకుండా నన్ను నటిగా ఎదగలేనని విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు'' అని బాధను వ్యక్తం చేసింది వైష్ణవి చైతన్య.

బేబి సినిమా విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా రూ.90 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టుకుంది.