English | Telugu
'12th ఫెయిల్' మూవీ రివ్యూ.. పాస్ అయిందా?
Updated : Nov 5, 2023
సినిమా పేరు: 12th ఫెయిల్
తారాగణం: విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అనంత్ వి జోషి, అన్షుమాన్ పుష్కర్, ప్రియాన్షు ఛటర్జీ తదితరులు
సంగీతం: శాంతను మోయిత్రా
డీఓపీ: రంగరాజన్ రామభద్రన్
రచన, దర్శకత్వం: విధూ వినోద్ చోప్రా
నిర్మాత: విధూ వినోద్ చోప్రా
బ్యానర్: వినోద్ చోప్రా ఫిలిమ్స్
విడుదల తేదీ: నవంబర్ 3, 2023
ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న హిందీ చిత్రం '12th ఫెయిల్' తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగులో పాస్ అవుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి, ఆ తర్వాత ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ఓ వ్యక్తి కథ ఈ చిత్రం. మధ్యప్రదేశ్ లోని చంబల్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ(విక్రాంత్ మాస్సే) 12వ తరగతి(ఇంటర్ సెకండ్ ఇయర్) చదువుతుంటారు. ఎలాగోలాగ కాపీ కొట్టి పాస్ అయితే, చిన్న ఉద్యోగం వస్తుందని అతని ఆశ. అయితే అక్కడికి కొత్తగా వచ్చిన డీఎస్పీ దుశ్యంత్ సింగ్(ప్రియాన్షు ఛటర్జీ) విద్యార్థులు కాపీ కొట్టకుండా అరికడతాడు. దీంతో మనోజ్ ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్యే మనుషులతో గొడవ కారణంగా తన అన్నయ్యని అరెస్ట్ చేస్తారు. ఆ సమయంలో అతన్ని విడిపించడానికి డీఎస్పీ దుశ్యంత్ సింగ్ సహాయం చేస్తాడు. అలా దుశ్యంత్ ని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు మనోజ్. కాపీ కొట్టకుండానే తదుపరి పరీక్షల్లో 12th పాస్ అవుతాడు. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి, సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం కోసం ఢిల్లీకి వెళ్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతను అనుకున్నది సాధించగలిగాడా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ముంబైకి చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. 12th ఫెయిల్ అయినప్పటికీ, అక్కడే ఆగిపోకుండా ఓ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఏకంగా ఐపీఎస్ అవుతాడు. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే సమయంలో అతను పడే కష్టాల నేపథ్యంలో ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఓ వైపు విద్యావ్యవస్థలో తీరుతెన్నులను చూపిస్తూనే.. మరోవైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులు కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు.
పరాజయం ఎదురైనంత మాత్రాన మన జీవితం అయిపోయినట్టు కాదని, ఆ పరాజయం నుంచే మన విజయానికి బాటలు వేసుకోవాలని చెప్పే చిత్రమిది. ఇది సీరియస్ కథ అయినప్పటికీ అక్కడక్కడా ఫన్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. చంబల్ ప్రాంత పరిస్థితులు, అక్కడి విద్య వ్యవస్థను చూపిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. నిజాయితీ కారణంగా హీరో తండ్రి ఉద్యోగం పోగొట్టుకోవడం, ఆ తర్వాత కుటుంబం పడే కష్టాలకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కోచింగ్ కోసం మనోజ్ సిటీ వెళ్ళాక సినిమా మరింత ఎమోషనల్ సాగుతుంది. డబ్బుల్లేక అతను పడే కష్టాలు.. ఓ వైపు పని చేస్తూ, మరోవైపు చదుకోవడం.. ఫెయిల్ అయినా ఆగిపోకుండా రీస్టార్ట్ అంటూ మళ్ళీ చదివే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకున్నాయి.
విధూ వినోద్ చోప్రా తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి, కథలో లీనమయ్యేలా చేశాడు. రియల్ స్టోరీని తీసుకొని, మనసుకి హత్తుకునేలా మలిచాడు. శాంతను మోయిత్రా సంగీతం ఆకట్టుకుంది. రంగరాజన్ రామభద్రన్ కెమెరా పనితనం కట్టిపడేసింది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. తెలుగు సంభాషణలు మెప్పించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే చక్కగా ఒదిగిపోయాడు. తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. మనోజ్ ప్రియురాలు శ్రద్ధాగా మేధా శంకర్, మనోజ్ ఫ్రెండ్ పాండేగా అనంత్ వి జోషి, గౌరీగా అన్షుమాన్ పుష్కర్, డీఎస్పీ దుశ్యంత్ సింగ్ గా ప్రియాన్షు ఛటర్జీ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి, ఆ తర్వాత ఐపీఎస్ అధికారిగా ఎదిగిన మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. పరాజయం ఎదురైనంత మాత్రాన మన జీవితం అయిపోయినట్టు కాదని, ఆ పరాజయం నుంచే మన విజయానికి బాటలు వేసుకోవాలని చెప్పే చిత్రం. ఫెయిల్యూర్ ఎదురైతే కృంగిపోకుండా లైఫ్ ని రీస్టార్ట్ చేయాలని తెలిపిన ఈ సందేశాత్మక చిత్రం హృదయాన్ని హత్తుకునేలా ఉంది.
రేటింగ్: 2.75/5