English | Telugu

‘విశ్వంభర’ లేట్‌కి కారణం అదే.. నిరాశలో మెగాభిమానులు!

శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత పది సంవత్సరాలు గ్యాప్‌ తీసుకొని ఖైదీ నంబర్‌ 150 సినిమా చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. మధ్యలో కొన్ని సినిమాల్లో కనిపించినా పూర్తి స్థాయి హీరోగా ఖైదీ నంబర్‌ 150లోనే కనిపించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో మెగాస్టార్‌ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్‌ అయింది. అయితే ఈ సినిమా తర్వాత చేసిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్‌ఫాదర్‌ చిత్రాలు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశపరిచాయి. ఆ తర్వాత బాబి కొల్లి కాంబినేషన్‌లో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మెగాభిమానులను హ్యాపీ చేసింది. ఆ వెంటనే మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చేసిన భోళాశంకర్‌ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వశిష్ట కాంబినేషన్‌లో చేస్తున్న ‘విశ్వంభర’పైనే మెగాస్టార్‌తోపాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా అద్భుతంగా వస్తోందనే సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌ సరసన త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ పైనే ఇప్పటివరకు క్లారిటీ లేదు.

‘విశ్వంభర’ షూటింగ్‌ పూర్తి చేసి అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు చిరంజీవి. అయినప్పటికీ విశ్వంభర రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేయకపోవడంతో మెగాభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్‌ చెయ్యాలనుకున్నారు. అదే టైమ్‌లో రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ ఉండడంతో చిరంజీవి తన సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారనే వార్తలు వచ్చాయి. నిజానికి అది కారణం కాదు. కొంత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మిగిలి ఉండడంతో అది పూర్తి చేయడానికి టైమ్‌ పడుతుందన్న ఉద్దేశంతో రిలీజ్‌ను వాయిదా వేశారు.

ఆమధ్య విడుదలైన టీజర్‌లో విఎఫ్‌ఎక్స్‌ క్వాలిటీగా లేదనే విమర్శలు వచ్చాయి. దీనిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా నడిచింది. అందుకే మరింత క్వాలిటీ రావడం కోసం ఆ వర్క్‌ మళ్ళీ చేయిస్తున్నారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఇదే కారణమని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది కూడా కాదు అని తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త వల్ల తెలుస్తోంది. అదేమిటంటే.. విశ్వంభర సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌ వల్ల ఆలస్యం జరుగుతోందట. ఆ పాటను ఎవరితో చేస్తే బాగుంటుందనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట మేకర్స్‌. తమన్నా, పూజా హెగ్డేలలో ఎవరో ఒకరితో ఆ పాట చేయించే అవకాశం ఉంది. ఆ పాట కూడా కంప్లీట్‌ చేసి ఫస్ట్‌ కాపీ వస్తే అప్పుడు సినిమా రిలీజ్‌ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌ ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.