English | Telugu

విజ‌య్‌కు రూ. 120 కోట్లు స‌మ‌ర్పించుకుంటున్న‌ దిల్ రాజు?

విజ‌య్ హీరోగా న‌టించే 66వ సినిమాకు మ‌హ‌ర్షి ఫేమ్ వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్ చేస్తున్న‌ట్లు రెండు నెల‌లుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల సింగ‌ర్ క్రిష్ ఈ న్యూస్‌ను క‌న్ఫామ్ చేశాడు. త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో వంశీకి బెస్ట్ విషెస్ చెబుతూ, విజ‌య్ నెక్ట్స్ ఫిల్మ్‌ను ఆయ‌న డైరెక్ట్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించిన క్రిష్‌, ఆ త‌ర్వాత ఎందుక‌నో ఆ పోస్ట్‌ను డిలిట్ చేశాడు.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్ర‌కారం 'విజ‌య్‌66' మూవీని వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేస్తాడ‌నీ, దిల్ రాజు నిర్మిస్తాడ‌నీ ద‌ళ‌ప‌తి క‌న్ఫామ్ చేశాడు. ఈ మూవీతో తెలుగులోకి నేరుగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు విజ‌య్‌. తెలుగు-త‌మిళ ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ సినిమాకు సౌత్ ఇండియాలోనే అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్‌ను విజ‌య్ అందుకోనున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మే అయితే, ద‌ళ‌ప‌తి విజ‌య్ ఈ సినిమాకు ఏకంగా రూ. 120 కోట్లు రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నాడు!

రెండు భాష‌ల్లో ఏక కాలంలో న‌టించాలి కాబ‌ట్టి రెండు సినిమాలకు తీసుకొనేంత పారితోషికాన్ని విజ‌య్ తీసుకుంటున్నాడ‌ని అంటున్నారు. ర‌జ‌నీకాంత్ స‌హా సౌత్‌లోని ఏ స్టార్ కూడా ఓ మూవీకి ఈ స్థాయి రెమ్యూన‌రేష‌న్ ఇప్ప‌టిదాకా తీసుకోలేదు.

ప్ర‌స్తుతం నెల్స‌న్ దిలీప్‌కుమార్ డైరెక్ష‌న్‌లో 'బీస్ట్' మూవీ చేస్తున్నాడు విజ‌య్‌. ఇందులో ఆయ‌న జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. అనిరుధ్ రవిచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.