English | Telugu

'బిగ్ బాస్ 4' హోస్ట్ విజ‌య్‌?

ఓవైపు క‌రోనా కేసులు బ‌య‌ట‌కు వ‌స్తున్నా టీవీ షోల షూటింగ్స్ కొన‌సాగుతూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే 'బిగ్ బాస్' 4వ సీజ‌న్‌కు సంబంధించిన ప్రి-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మూడో సీజ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో నాలుగో సీజ‌న్‌కు సైతం హోస్ట్‌గా నాగార్జున వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఇప్ప‌టి దాకా అనుకుంటూ వ‌చ్చారు. అయితే తాజాగా వినిపిస్తున్న దాని ప్ర‌కారం, ఆయ‌న స్థానంలో సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చే అవ‌కాశాలున్నాయంట‌. ఈ మేర‌కు అత‌నితో 'బిగ్ బాస్' తెలుగు వెర్ష‌న్ నిర్వాహ‌కులు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ప్రచారం న‌డుస్తోంది.

ఇదివ‌ర‌కు స‌మంత పేరు కూడా వినిపించినా, అందులో నిజం లేద‌ని వెల్ల‌డైంది. మ‌రిప్పుడు విజ‌య్ పేరు కూడా అలా స్పెక్యులేష‌న్‌లో భాగంగా వ‌చ్చిందా, నిజంగానే ఆయ‌నను సంప్ర‌దిస్తున్నారా.. అనే విష‌యం తెలియాల్సి ఉంది. అయితే నాగార్జున‌కు ప్ర‌త్యామ్నాయంగా మరొక‌రిని హోస్ట్‌గా తీసుకోవాల‌నే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌నీ, అందులో భాగంగానే విజ‌య్ పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌నీ అంటున్నారు. ఏదేమైనా ఆగ‌స్ట్‌లో 'బిగ్ బాస్ 4' తెలుగు షో మొద‌ల‌వ‌నున్న‌ది.