English | Telugu

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌' రీషూట్‌?

అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'. టాప్ యాక్ట్రెస్ పూజా హెగ్డే హీరోయిన్‌. తెలుగులో 2013లో తీసిన 'ఒంగోలు గిత్త' సినిమా త‌ర్వాత బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా మిగ‌తా అన్ని సినిమాల షూటింగ్‌ల‌కు మ‌ల్లే ఈ సినిమా షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌లో ఆగిపోయింది. లేన‌ట్ల‌యితే మేలోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఉండేది. కాగా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆ సినిమా రీషూట్‌కు ప్లాన్స్ జ‌రుగుతున్నాయంటూ విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

లాక్‌డౌన్‌లో ల‌భించిన తీరిక స‌మ‌యంలో ఈ సినిమా ర‌షెస్ చూసిన అక్కినేని నాగార్జున‌, చిత్ర స‌మ‌ర్ప‌కుడు అల్లు అర‌వింద్ కొన్ని పోర్ష‌న్స్ విష‌యంలో అసంతృప్తి చెందార‌నీ, అందువ‌ల్ల షూటింగ్‌లు పునఃప్రారంభం కాగానే వాటిని రీషూట్ చెయ్యాల‌నే అభిప్రాయానికీ వ‌చ్చార‌నీ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెప్పుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అఖిల్ చేసిన మూడు సినిమాల్లో ఏ ఒక్క‌టీ హిట్ కాక‌పోవ‌డంతో, నాలుగో సినిమాతోనైనా హిట్ కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో అత‌నున్నాడు.

అల్లు అర‌వింద్ సూచ‌న‌తో డైరెక్ట‌ర్ భాస్క‌ర్ స్ర్కిప్టులో అవ‌స‌ర‌మైన మార్పులు చేస్తున్నాడంటున్నారు. 'బొమ్మ‌రిల్లు', 'ప‌రుగు' సినిమాల త‌ర్వాత అత‌ని కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్ న‌డుస్తూ ఉంది. 'ఆరెంజ్‌', 'ఒంగోలు గిత్త' సినిమాలు డిజాస్ట‌ర్స్ కావ‌డంతో పాటు, బ్లాక్‌బ‌స్ట‌ర్ మ‌ల‌యాళం మూవీ 'బెంగ‌ళూర్ డేస్‌'కి రీమేక్‌గా అత‌ను తీసిన 'బెంగ‌ళూర్ నాట్‌క‌ల్' సైతం ఫ్లాప‌వ‌డంతో బాగా డీలా ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో అత‌నికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'ను డైరెక్ట్ చేసే అవ‌కాశం రావ‌డం చిన్న విష‌య‌మేమీ కాదు. గోపీసుంద‌ర్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తోన్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాస్ నిర్మిస్తున్నాడు.