English | Telugu

ఓటీటీలోకి ఎంట‌ర‌వుతున్న మ‌హేశ్‌?

కొన్ని చాన‌ల్ సంస్థ‌లు ఇప్ప‌టికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట‌రై బిజినెస్ చేసుకుంటున్నాయి. జీ, జెమిని వంటివి అందుకు ఉదాహ‌ర‌ణ‌. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే గీతా ఆర్ట్స్ అధినేత, సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ 'ఆహా' పేరుతో ఓటీటీ స్ట్రీమింగ్ సైట్‌ను గ‌తేడాది ప్రారంభించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌ను, ఇండ‌స్ట్రీ హిట్స్‌ను అందించిన ఆయ‌న 'ఆహా' విష‌యంలో ఇంకా అలాంటి స‌క్సెస్‌ను అందుకోలేదు. కేవ‌లం తెలుగు కంటెంట్‌ను న‌మ్ముకొని ఆయ‌న ముందుకు వెళ్తుండ‌ట‌మే దీనికి కార‌ణం కావ‌చ్చు. ఒక బ్లాక్‌బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ ప‌డితేనో లేదంటే బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ స్ట్రీమింగ్ అయితేనో కానీ అలాంటిది జ‌ర‌గ‌దు.

అల్లు అర‌వింద్ ప‌రిస్థితి అలా ఉండ‌గా, తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ఓటీటీలోకి అడుగు పెడ‌తాడ‌నే ప్ర‌చారం ఆన్‌లైన్‌లో న‌డుస్తోంది. కేవ‌లం న‌ట‌న‌తో స‌రిపెట్ట‌కుండా ఇత‌ర వ్యాప‌కాల్లోనూ మ‌హేశ్ ఆస‌క్తి చూపుతున్న సంగ‌తి మ‌న‌కు తెలుసు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పార్ట‌న‌ర్‌షిప్స్‌తో సినిమాలు నిర్మిస్తున్న అత‌ను, ప‌లు బిగ్ బ్రాండ్ల ఎండార్స్‌మెంట్లు చూసుకుంటున్నాడు. మ‌ల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టి జీఎంబీ మాల్‌ను ఏర్పాటుచేసి స‌క్సెస‌య్యాడు. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి కార‌ణంగా మిగ‌తా మాల్స్ త‌ర‌హాలోనే అది కూడా మూత‌ప‌డి ఉండ‌టం వేరే సంగ‌తి. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చాన‌ల్ అత‌డి వ్యాపారాల‌కు అద‌నంగా తోడ‌వ‌నున్న‌ద‌న్న మాట‌.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే, ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌ర్కారు వారి పాట' చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు మ‌హేశ్‌. తొలిసారి అత‌నికి జోడీగా కీర్తి సురేశ్ న‌టించ‌నున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌లిసి నిర్మించ‌నున్నాయి.