English | Telugu

ద‌ర్శ‌కేంద్రుడి జోడీగా ఆయ‌న ఫ‌స్ట్ ఫిల్మ్ హీరోయిన్‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు పూర్తిస్థాయి న‌టుడిగా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. న‌టుడు, ద‌ర్శ‌కుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి రూపొందించ‌నున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో రిటైర్డ్ ప్ర‌భుత్వ ఉద్యోగిగా రాఘ‌వేంద్ర‌రావు న‌టించ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య క‌థ‌నాలు వ‌చ్చాయి. అలాగే ఇందులో రాఘ‌వేంద్ర‌రావుకి జంట‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌బోతోందంటూ ప్ర‌చారం సాగింది. అందాల తార‌లు శ్రియ‌, స‌మంత కూడా అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో రాఘ‌వేంద్ర‌రావుకి జోడీగా సీనియ‌ర్ యాక్ట్ర‌స్ ల‌క్ష్మి న‌టించ‌బోతున్నార‌ట‌. క‌థ‌, త‌న‌ పాత్ర న‌చ్చ‌డంతో ల‌క్ష్మి ఈ సినిమాకి వెంట‌నే ఓకే చెప్పార‌ని టాక్. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం 'బాబు' (1975)లో ఇద్ద‌రు క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా ల‌క్ష్మి న‌టించారు. క‌ట్ చేస్తే.. తొలిసారి ఆయ‌న పూర్తిస్థాయి న‌టుడిగా క‌నిపించ‌నున్న సినిమాలోనూ ల‌క్ష్మి లీడ్ రోల్ లో క‌నిపించ‌నుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

అలాగే, భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'మిథునం' (2012)లోనూ ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన విష‌యం విదిత‌మే. త్వ‌ర‌లోనే రాఘ‌వేంద్ర‌రావు - భ‌ర‌ణి కాంబినేష‌న్ మూవీలో ల‌క్ష్మి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. రాఘ‌వేంద్ర‌రావు, ల‌క్ష్మి జంట ఏ స్థాయిలో అల‌రిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.