English | Telugu
`పవర్ పేట`.. నితిన్ స్థానంలో శర్వానంద్?
Updated : Jun 9, 2021
`పవర్ పేట`.. చాన్నాళ్ళుగా టాలీవుడ్ లో వార్తల్లో ఉన్న ప్రాజెక్ట్. `ఛల్ మోహన్ రంగ` (2018) తరువాత యూత్ స్టార్ నితిన్ - టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య కాంబినేషన్ లో సెట్ అయిన సినిమా ఇది. 1960 - 2021 మధ్య కాలంలో నడిచే పిరియడ్ డ్రామాగా.. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందనున్నట్లు కథనాలు వచ్చాయి. అలాగే 18 ఏళ్ళ కుర్రాడిగా.. 40 ఏళ్ళ మధ్య వయస్కుడిగా.. 60 సంవత్సరాల ముసలి వాడిగా ఇందులో నితిన్ నటించబోతున్నట్లూ ప్రచారం సాగింది. ఏమైందో ఏమో.. నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎక్కువ కాల్షీట్స్ కేటాయించాల్సి రావడం వల్లే ఈ సినిమాని వదులుకున్నాడట నితిన్.
ఈ నేపథ్యంలోనే.. కృష్ణ చైతన్య మరో యంగ్ హీరో శర్వానంద్ ని అప్రోచ్ అయ్యాడట. ఈ తరహా సెమీ పిరియడ్ డ్రామాలను చెప్పుకోదగ్గ స్థాయిలో చేసిన అనుభవం ఉన్న శర్వా.. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అన్నీ కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుందని.. ఇందులో కీర్తి సురేశ్ నాయికగా నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే `పవర్ పేట`కి సంబంధించి పూర్తి వివరాలు స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి.. నితిన్ వదులుకున్న ఈ ప్రాజెక్ట్ శర్వానంద్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం శర్వానంద్ చేతిలో `మహాసముద్రం`, `ఆడాళ్ళూ మీకు జోహార్లు` చిత్రాలున్నాయి. అలాగే, తెలుగు-తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు శర్వా.