English | Telugu

తెలుగు హీరో వద్దు సార్ అంటున్న సితార.. వెంకీ పనేనా..?

తెలుగు హీరో వద్దు సార్ అంటున్న సితార.. వెంకీ పనేనా..?

 

'తొలిప్రేమ'తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి, మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' సినిమాలతో నిరాశపరిచిన వెంకీ.. ప్రేమ కథలను పక్కనపెట్టి ట్రాక్ మార్చాడు. వెంకీ దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలు 'సార్', 'లక్కీ భాస్కర్' మెప్పించాయి. అయితే ఈ రెండు సినిమాల్లో తెలుగు హీరోలు నటించలేదు. దీంతో ఇలాంటి మంచి కంటెంట్ సినిమాలను తెలుగు హీరోలతో చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వెంకీ డైరెక్ట్ చేసే నెక్స్ట్ మూవీలోనైనా తెలుగు హీరో నటిస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారికి నిరాశ తప్పేలా లేదు. (Venky Atluri)

 

వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని కూడా తెలుగు హీరోతో చేయడం లేదని తెలుస్తోంది. తమిళ హీరో ధనుష్ తో 'సార్', మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో 'లక్కీ భాస్కర్' చేసిన వెంకీ.. తన నెక్స్ట్ మూవీని మళ్ళీ ధనుష్ తో చేయబోతున్నట్లు సమాచారం. 'రంగ్ దే' నుంచి వెంకీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా రూపొందనుందట. అంతేకాదు, ఈ సినిమాకి 'హానెస్ట్ రాజ్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారని వినికిడి. 1994లో విజయకాంత్ హీరోగా ఈ టైటిల్ తో తమిళ్ లో ఒక సినిమా రావడం విశేషం. (Honest Raj)

 

కాగా దర్శకుడు వెంకీ అట్లూరి 'సార్', 'లక్కీ భాస్కర్' కథలను మొదటగా తెలుగు హీరోలకే చెప్పాడని.. కానీ ఆ కథలను కొందరు రిజెక్ట్ చేస్తే, మరికొందరు చేంజెస్ చెప్పారని.. అందుకే వెంకీ ఇతర భాషల హీరోల వైపు చూస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న మాట. అయితే 'హానెస్ట్ రాజ్' తర్వాత నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో వెంకీ అట్లూరి ఒక సినిమా చేసే అవకాశముందని అంటున్నారు.