English | Telugu
చిరు చిత్రంలో వరుణ్ తేజ్?
Updated : Jun 4, 2021
తన కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి.. స్క్రీన్ షేర్ చేసుకోవడం తరుచుగా చోటుచేసుకునే వ్యవహారమే. `రాక్షసుడు` (1986) మొదలుకుని తను కథానాయకుడిగా నటించిన ఎన్నో చిత్రాల్లో తన పెద్ద తమ్ముడు నాగబాబుతో కలిసి నటించారు చిరు. అలాగే.. నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన `హేండ్సప్`లో ఓ అతిథి పాత్రలో మెరిశారు మెగాస్టార్. అలాగే తను కథానాయకుడిగా నటించిన `శంకర్ దాదా` సిరీస్ లో తన చిన్న తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నటింపజేసి అభిమానులను ఆనందపరిచారు. అలాగే.. తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన `మగధీర`, `బ్రూస్ లీ` చిత్రాల్లో అతిథిగా కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `ఆచార్య`లోనూ చరణ్ తో కలిసి నటిస్తున్నారు చిరు. ఇక తన మామయ్య అల్లు రామలింగయ్యతో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన చిరు.. బావ అల్లు అరవింద్ తోనూ కొన్ని సినిమాల్లో సందడి చేశారు. అలాగే తను హీరోగా నటించిన `డాడీ`, `శంకర్ దాదా జిందాబాద్` చిత్రాల్లో మేనల్లుడు అల్లు అర్జున్ ని అతిథిని చేశారు.
ఈ క్రమంలోనే.. త్వరలో మరో మెగా కాంపౌండ్ హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో కలిసి చిరంజీవి నటించబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`కి రీమేక్ గా రూపొందనున్న చిత్రంలో చిరు మెయిన్ లీడ్ గా నటిస్తుండగా.. మాతృకలో టొవినో థామస్ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, మోహనరాజా డైరెక్ట్ చేయనున్న `లూసిఫర్` త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.