English | Telugu

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్!!

రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన వక్కంతం వంశీ.. దర్శకుడిగా మాత్రం మొదటి సినిమాతో ప్లాప్ అందుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమాతో వంశీ దర్శకుడిగా మారాడు. కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన రచయిత దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా కావడంతో.. ఈ సినిమా భారీ అంచనాలతోనే విడుదలైంది. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. ఈ సినిమా వచ్చి మూడేళ్లు దాటినా ఇంతవరకు వంశీ తన రెండో సినిమాను ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఎట్టకేలకు ఆయన రెండో సినిమాకు మోక్షం కలిగినట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన హీరో నితిన్ తో యాక్షన్ ఎంటర్టైనర్ తీయనున్నాడని సమాచారం.

గత ఏడాది 'భీష్మ' మూవీతో సూపర్ హిట్ అందుకున్న నితిన్.. ఈ ఏడాది మాత్రం చెక్, రంగ్ దే సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం ‘అంధాధూన్‌’ రీమేక్‌ గా తెరకెక్కుతున్న ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాపై నితిన్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అలాగే నితిన్ తన తదుపరి సినిమాను కూడా లైన్ లో పెట్టాడట. ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో భీష్మ లాంటి సాలిడ్ హిట్ అందుకోవాలి అనుకుంటున్న నితిన్.. వక్కంతం వంశీతో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోన్న ఈ చిత్రం ఆగస్ట్‌లో మొదలు కానుందని సమాచారం.