English | Telugu
రామ్ చరణ్ తో త్రివిక్రమ్ మూవీ!!
Updated : May 22, 2021
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా తరువాత మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని దృష్టిలో పెట్టుకొని ఓ కథ సిద్ధం చేశారని సమాచారం.
మెగా హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తోను మూడేసి సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్.. చరణ్ తో మాత్రం ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేయడం కోసం చరణ్ ని దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ అద్భుతమైన కథని రెడీ చేశారట. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే 'అల వైకుంఠపురములో' తో బన్నీకి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ మంచి ఫామ్ లో ఉన్నారు.
కాగా చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నాడు. మరోవైపు ఆచార్య చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాల తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశముంది.