English | Telugu

అజ్ఞాతవాసికి దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చుంటే..?

సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్‌కు ఓ నెల రోజుల నుంచే పాటల సందడి మొదలవుతుంది. కాలర్‌ట్యూన్స్‌తో పాటు కొన్ని ఈవెంట్లలోనూ పవన్ సినిమా పాటల హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే దర్శకనిర్మాతలు మాస్, క్లాస్ బీట్స్‌తో జ్యూక్ బాక్స్‌ని రెడీ చేయిస్తారు. పవర్‌స్టార్ లేటేస్ట్ మూవీ అజ్ఞాతవాసి ఆడియో రిలీజై.. మరికొద్ది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ "బయటకొచ్చి చూస్తే", "గాలి వాలుగా" పాటలు మినహా మిగిలిన సాంగ్స్ అంతగా జనాల్లోకి వెళ్లలేదు. అయితే ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పవన్ అభిమానులు సోషల్ మీడియాసాక్షిగా వాదిస్తున్నారు.

త్రివిక్రమ్‌కి దేవిశ్రీ ఆస్థాన సంగీత దర్శకుడు.. వీరిద్దరి కాంభినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సాంగ్స్ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపాయి. చాలామందికి ఇవి ఫేవరేట్ సాంగ్స్.. కానీ ఏవో కారణాల వల్ల త్రివిక్రమ్‌కి దేవికి మధ్య గ్యాప్ వచ్చింది. "అ ఆ" మూవీకి మిక్కిజేమేయర్‌తోనూ.. అజ్ఞాతవాసికి అనిరుధ్‌తోనూ పనికానిచ్చాడు తప్పించి దేవికి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి‌కి అదిరిపోయే లిరిక్స్ రాయించారు కానీ అందుకు తగ్గ ట్యూనింగ్ మిస్సయిందంటున్నారు అభిమానులు. ముఖ్యంగా పవన్ ప్రతి సినిమాలోనూ టైటిల్ సాంగ్ అదిరిపోయేది.. అజ్ఞాతవాసి టైటిల్ సాంగ్ మాత్రం అంత క్యాచీగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే అనిరుధ్ స్థానంలో దేవిశ్రీ ఉండుంటే మిగిలిన సాంగ్స్ ఎలా ఉన్నా.. టైటిల్ సాంగ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉండేదని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా దేవికి అభిమానుల నాడి బాగా తెలుసు అనేది ఇండస్ట్రీ మాట.