English | Telugu

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న క్రిష్‌... మళ్ళీ డాక్టర్‌తోనే?

టాలీవుడ్‌ డైరెక్టర్లలో క్రిష్‌ది ఓ విభిన్నమైన శైలి. అతను ఎంపిక చేసుకునే కథలు గానీ, సినిమా తీసే విధానంగానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ‘గమ్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్‌ ఆ తర్వా వేదం, కృష్ణం వందే జగద్గురుమ్‌, కంచె వంటి సినిమాలతో ఓ స్పెషాలిటీ వున్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉందిగానీ అతని వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఉన్నాయి. ముఖ్యంగా క్రిష్‌ వైవాహిక జీవితం విఫలమైంది. 2016 ఆగస్ట్‌ 7న హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో డాక్టర్‌ రమ్య వెలగతో క్రిష్‌ వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. అయితే వీరి వైవాహిక జీవితం ఎంతో కాలం సాగలేదు. పెళ్ళయిన కొన్నాళ్ళకే వారి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. యుఎస్‌లో మరో పెళ్లి చేసుకొని రమ్య అక్కడ సెటిల్‌ అయిందని తెలుస్తోంది. 

క్రిష్‌ మాత్రం అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. మరో పెళ్ళి చేసుకోవాలని అతనిపై కుటుంబ సభ్యులు, మిత్రులు బాగా ఒత్తిడి తెస్తుండడంతో రెండో పెళ్లి చేసుకునేందుకు క్రిష్‌ అంగీకరించినట్టు తెలుస్తోంది. రెండోసారి కూడా డాక్టర్‌నే పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. హైదరాబాద్‌కి చెందిన ఆ డాక్టర్‌కి గతంలోనే వివాహం అయిందని, విభేదాల వల్ల భర్త నుంచి విడిపోయిందని తెలుస్తోంది. ఆమెకు 11 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడట. ఇరు కుటుంబాల మధ్య ఈ విషయం చర్చకు రావడం, వారు అంగీకరించడం జరిగిపోయిందని సమాచారం. మీడియాలో, సోషల్‌ మీడియాలో క్రిష్‌ పెళ్ళి గురించిన వార్తలు చాలా వస్తున్నాయి. అయితే ఇరు కుటుంబాల వారు ఇప్పటివరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కాబట్టి ఇప్పటివరకు దీన్ని ఓ రూమర్‌గానే అందరూ పరిగణిస్తున్నారు.